Madanapalle: గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

Madanapalle: మదనపల్లెలో రూ. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కరవు సీమను సిరుల సీమగా మారుస్తామన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 2 Oct 2026 8:21 PM IST
Madanapalle
X

Madanapalle: గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

మదనపల్లె: కరవుసీమగా పేరున్న రాయలసీమను సిరుల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించిన మరుక్షణం నుంచి ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో ఉన్నామని... దాంట్లో భాగంగానే రాయలసీమలోని ఎనిమిది జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఉద్యాన రైతులకు మేలు చేసేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం గ్లోబల్ హార్టికల్చర్ హబ్-GHH, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర సహకారంతో రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడులతో మరో రూ.60 వేల కోట్లను సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని సాకారం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవుసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

ఉద్యాన రంగం ప్రాథమిక రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రస్తుతం సుమారు రూ.1.50 లక్షల కోట్ల జీవీఏ అందిస్తున్న ఈ రంగం ద్వారా మరో రూ.లక్ష కోట్ల జీవీఏను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 6 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించేలా ఈ ప్రాజెక్టులో కార్యాచరణ చేపట్టనున్నామన్నారు. రైతులకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల వరకు సమగ్ర మద్దతు అందించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు చెప్పారు.

పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. యాపిల్, స్ట్రాబెరీ నుంచి అరటి, ఆవకాడో, కివీ, ఖర్జూరం వరకు వివిధ రకాల ఉద్యాన పంటలకు ప్రోత్సహం అందించనున్ననట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలను అభివృద్ధి చేసి రైతులకు మేలు చేసే వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సీడ్ టు షిప్‌మెంట్ వ్యవస్థల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా కార్యక్రమాలను అమలు చేయనున్నామని సీఎం వెల్లడించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI