Madanapalle: సాగునీరందిస్తాం... బంగారం పండించండి - సీఎం చంద్రబాబు
Madanapalle: రాయలసీమకు సాగునీరు అందించి బంగారం పండిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మూడేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.
Madanapalle: సాగునీరందిస్తాం... బంగారం పండించండి - సీఎం చంద్రబాబు
మదనపల్లె: సాగునీరు అందిస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారని, మార్కెటింగ్ ద్వారా సంపద సృష్టిస్తారని సీఎం పేర్కొన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, రూ.3,500 కోట్లతో హంద్రీ-నీవా కాలువను పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లామని చెప్పారు. వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి మార్కాపురానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని అందించామని వివరించారు.
మరో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమలో హంద్రీ-నీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయని సీఎం అన్నారు.
గోదావరిలో ఈ ఏడాది కూడా సుమారు 1,600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమకు తరలించడం నదుల అనుసంధానం వల్లే సాధ్యమైందన్నారు. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు.
పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, డిజిటల్ కనెక్టివిటీ మాదిరిగా వాటర్ గ్రిడ్ అవసరమని చెప్పారు. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంతో రాయలసీమ కరవు తీరడంతోపాటు... దక్షిణాదిలోని 4 రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
రిలయన్స్ సంస్థ సహకారంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయం, ఉద్యానవనం, ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ సంస్థను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. ఐఐఎంలో మేనేజ్‌మెంట్ నిపుణులు, ఐఐటీలో సాంకేతిక నిపుణులు, ఐఎస్‌బీలో పారిశ్రామిక నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్లే.. ఐఎస్ఏ ద్వారా వ్యవసాయ రంగంలో నాయకత్వ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.




