Madanapalle: మహిళపై ట్రాక్టర్తో హత్యాయత్నం - నిందితుడికి 5 ఏళ్ల జైలు
Madanapalle: మదనపల్లెలో ట్రాక్టర్తో మహిళపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడు నాగరాజకు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Madanapalle: మహిళపై ట్రాక్టర్తో హత్యాయత్నం - నిందితుడికి 5 ఏళ్ల జైలు
మదనపల్లె: దారి, ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మదనపల్లె 7వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి శ్రీమతి ఆర్.శ్రీలత గురువారం తీర్పునిచ్చారు.
చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ కొలింపల్లెకు చెందిన పాశం నాగరాజ (45)కు, అదే గ్రామానికి చెందిన ఫిర్యాదుదారులకు మధ్య దారి, ఇంటి స్థలానికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అడ్డువచ్చిన ఫిర్యాదుదారుడి భార్య యనమల సావిత్రమ్మపైకి నాగరాజ ఉద్దేశపూర్వకంగా తన ట్రాక్టర్‌ను వేగంగా పోనిచ్చాడు.
ఆమె ఎడమ కాలు, ఛాతీపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఎముకలు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రాజ్ కిషోర్ ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొంది ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
అప్పటి చౌడేపల్లె ఎస్ఐ జి.రవికుమార్ ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరానికి వాడిన వాహనాలను సీజ్ చేసి పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.గణపతి బాధితుల తరఫున కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండటంతో నేరం రుజువై, న్యాయమూర్తి నిందితుడు నాగరాజను దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు.
మహిళపై దాడికి పాల్పడిన నిందితుడికి శిక్ష పడేలా పక్కాగా దర్యాప్తు చేసిన అప్పటి ఎస్ఐ రవికుమార్, ప్రస్తుత ఎస్ఐ జి.చిన్నరెడ్డప్ప, ఏపీపీ గణపతి, కోర్టు లైజన్ ఆఫీసర్ (హెడ్ కానిస్టేబుల్) జి.సతీష్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ కె.నాగరాజలను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.




