Madanapalle: నామినేషన్ల వేళ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు!
Madanapalle: నామినేషన్ల వేళ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.
Madanapalle: నామినేషన్ల వేళ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు!
మదనపల్లె: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు. రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై వారు తీవ్రంగా స్పందించారు.
నామినేషన్ల ప్రక్రియలో మిగిలిన రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాయచోటిలో జరిగిన ఘర్షణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలపై విచారణ చేపట్టామని డీఐజీ తెలిపారు.
డ్రోన్ కెమెరాలు, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనంగా రెండు ప్లాటూన్ల పోలీసు బలగాలను రాయచోటిలో మోహరించినట్లు వెల్లడించారు. పుంగనూరు ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ, నామినేషన్ కేంద్రం 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రావడం, వాహనం జనాల వైపు దూసుకెళ్లిన ఘటనలో పలువురికి గాయాలైనట్లు వివరించారు.
పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, ఎంపీ మిథున్ రెడ్డికి భద్రత కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.




