Chittoor: పుస్తక పఠనంతోనే మేధోశక్తి పెంపొందుతుంది: డీఈఓ లక్ష్మీనారాయణ!
Chittoor: పుస్తక పఠనంతోనే మేధోశక్తి పెరుగుతుందని, స్మార్ట్‌ఫోన్లు, ఏఐ సాధనాలపై అతిగా ఆధారపడవద్దని చిత్తూరు డీఈఓ కె. లక్ష్మీనారాయణ సూచించారు.
Chittoor: పుస్తక పఠనంతోనే మేధోశక్తి పెంపొందుతుంది: డీఈఓ లక్ష్మీనారాయణ!
చిత్తూరు: మేధోశక్తిని పెంపొందించుకోవడంతో పాటు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి కె. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం, 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరులో గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతోందన్నారు.చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధస్సు సాధనాలపై అతిగా ఆధారపడటం వల్ల సొంతంగా ఆలోచించే సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
విద్యార్థులు ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ,నవంబర్ 14 నుంచి 20 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రంథాలయాల్లో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వివిధ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి శర్మ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సహదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.




