YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్.. డబ్బు సంపాదించడం ఇక చాలా కష్టం
YouTube: యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని లేదా ఆ ప్లాట్‌ఫామ్‌పై తమ కెరీర్‌ను సీరియస్‌గా బిల్డ్ చేసుకోవాలనుకునే క్రియేటర్లకు ఒక పెద్ద సవాలు ఎదురుకాబోతోంది.
YouTube
YouTube: యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని లేదా ఆ ప్లాట్‌ఫామ్‌పై తమ కెరీర్‌ను సీరియస్‌గా బిల్డ్ చేసుకోవాలనుకునే క్రియేటర్లకు ఒక పెద్ద సవాలు ఎదురుకాబోతోంది. గ్లోబల్ వీడియో దిగ్గజం యూట్యూబ్ తన పార్టనర్ ప్రోగ్రామ్ నిబంధనలలో కీలక మార్పులను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఫిబ్రవరి 1, 2027 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సరికొత్త మార్పుల తర్వాత కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ ద్వారా ప్రకటనల రూపంలోనూ, ఇతర వైపీపీ ఆదాయం పొందడంలోనూ కఠినమైన ఆంక్షలు ఎదురుకానున్నాయి. కేవలం సరదాగా వీడియోలు చేసే వారికి ఇది ఒకరకంగా పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు గత 365 రోజులలో వెయ్యి మంది సబ్‌స్క్రైబర్‌లతో పాటు ఏకంగా 8,000 అర్హత కలిగిన వాచ్ అవర్స్‌ను కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్స్ వీడియోల ద్వారా వెళ్లాలనుకుంటే, గత 90 రోజులలో 20 మిలియన్ల అర్హత కలిగిన షార్ట్స్ వ్యూస్‌లను దక్కించుకోవడం అనివార్యమైంది. అంటే కేవలం ఛానెల్ సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం మాత్రమే సరిపోదు, కంటెంట్ వాస్తవ రీచ్, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్, వాచ్ అవర్స్ కూడా చాలా కీలకంగా మారాయి.
ఈ కఠినమైన నిబంధనలు భారతీయ క్రియేటర్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. క్రియేటర్లు ఇకపై యూట్యూబ్‌ను కేవలం పార్ట్ టైమ్ లేదా అదనపు ఆదాయ వనరుగా కాకుండా ఒక పూర్తిస్థాయి కెరీర్‌గా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒరిజినల్ కంటెంట్, లాంగ్ ఫార్మాట్ వీడియోలు, ప్రేక్షకుల భాగస్వామ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఛానెల్‌ను దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవాలనుకునే వారు నిరంతరం నాణ్యమైన, ఉపయోగకరమైన కంటెంట్‌ను అందించడం ఒక్కటే మార్గం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చాక వీడియో క్రియేషన్ చాలా సులభమైంది. స్క్రిప్ట్‌లు, వాయిస్, విజువల్స్ అన్నీ నిమిషాల్లో తయారవుతున్నాయి. కానీ వేలాది ఛానెళ్లు ఒకే రకమైన ఏఐ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తుండటంతో మౌలికత ప్రశ్నార్థకమవుతోంది. కాబట్టి కేవలం ఆటోమేషన్‌పై ఆధారపడకుండా సొంత క్రియేటివిటీని జోడించడం ముఖ్యం. అలాగే కేవలం యాడ్‌సెన్స్ ఆదాయంపైనే కాకుండా బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు, అఫిలియేట్ మార్కెటింగ్, మర్చండైజ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.




