Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో బయటపడ్డ రూ. 150 కోట్లు భారీ స్కామ్!

Flipkart: ఫ్లిప్‌కార్ట్ B2B విభాగంలో రూ. 150 కోట్లకు పైగా అక్రమ ముడుపులు స్వీకరించినట్లు విజిల్‌బ్లోయర్లు ఆధారాలతో సహా బయటపెట్టారు.

Gagan kumar
Published on: 1 Nov 2026 1:21 PM IST
Flipkart
X

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో బయటపడ్డ రూ. 150 కోట్లు భారీ స్కామ్!

Flipkart kickback scam: భారత ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఫ్లిప్‌కార్ట్ లో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూడటం దేశీయ కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్లాట్‌ఫామ్‌లో కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు అక్రమ ముడుపులకు కక్కుర్తి పడి, కొన్ని నిర్దిష్టమైన బ్రాండ్లు, విక్రేతలకు అనవసరమైన లబ్ధి చేకూర్చారని తెలుస్తోంది. రూ. 150 కోట్లకు పైగా విలువైన ఈ భారీ కుంభకోణంపై ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ అత్యంత తీవ్రంగా స్పందిస్తూ అంతర్గత దర్యాప్తుకు ఆదేశించింది.

ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిజినెస్-టు-బిజినెస్ విభాగంలోని స్మార్ట్‌ఫోన్‌లు, లగేజ్, ట్రావెల్ యాక్సెసరీస్ వంటి విభాగాలు ప్రధాన లక్ష్యంగా ఈ దందా సాగినట్లు సమాచారం. కొందరు విక్రేతలకు , బ్రాండ్లకు ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ అమ్మకాలు జరిగేలా ఉద్యోగులు అక్రమంగా సహాయపడ్డారు.

దీనికి ప్రతిఫలంగా సదరు విక్రేతల నుండి ఉద్యోగులు రూ. 150 కోట్లకు పైగా నగదుతో పాటు, ఆయా కంపెనీల్లో వాటాలను లంచంగా స్వీకరించారనేది ప్రధాన ఆరోపణ. విజిల్‌బ్లోయర్లు ఈ వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో గడిచిన మూడేళ్ల వ్యవధిలో వాల్‌మార్ట్ ఇటువంటి విచారణ చేపట్టడం ఇది మూడోసారి. అయితే ఈసారి పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. అమెరికా నిబంధనల ప్రకారం, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద తీవ్రమైన నిబంధనలను అమలు చేస్తుంది.

మాతృ సంస్థగా వాల్‌మార్ట్ కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో నమోదై ఉన్నందున, ఫ్లిప్‌కార్ట్‌లో జరిగిన ఈ అక్రమాలకు వాల్‌మార్ట్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విచారణను వాల్‌మార్ట్ అత్యంత పారదర్శకంగా, కఠినంగా నిర్వహిస్తోంది.

ఒకవైపు ఆర్థిక అవకతవకల విచారణ ఫ్లిప్‌కార్ట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు అంతర్గతంగా సంస్థ తీవ్ర నిపుణుల కొరతను, ఉద్యోగుల అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ నిరంతరం ఆలస్యం కావడం కంపెనీ ప్రతిష్టపై ప్రభావం చూపుతోంది.

ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను ఎప్పుడు నగదుగా మార్చుకోవచ్చో కంపెనీ యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే స్టాక్ బైబ్యాక్ విధానంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ 1,000 మందికి పైగా మాజీ ఉద్యోగులు వాల్‌మార్ట్ బోర్డుకు బహిరంగంగా లేఖ రాశారు.

విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఈ-కామర్స్ దిగ్గజంలో ఒక్కసారిగా విజిల్‌బ్లోయర్ల ఫిర్యాదులతో మొదలైన ఈ ముడుపుల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.