Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు భారీ నష్టం.. రెండో త్రైమాసికంలో రూ.5,975 కోట్లు
Vodafone Idea: వోడాఫోన్ ఐడియా రెండో త్రైమాసికంలో రూ.5,975 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం, ARPU, 4G, 5G చందాదారుల వివరాలు తెలుసుకోండి.
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు భారీ నష్టం.. రెండో త్రైమాసికంలో రూ.5,975 కోట్లు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.5,975 కోట్లకు చేరింది. అంతకుముందు జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.3,747 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టం మరింత పెరిగింది. సెటిల్మెంట్ షేర్ల మార్కెట్ విలువ పునఃమూల్యాంకనం కారణంగా ఏర్పడిన అసాధారణ నష్టం కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపింది.
ఆదాయం స్వల్పంగా పెరుగుదల
కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదిక ప్రకారం.. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం జూన్ త్రైమాసికంలోని రూ.11,689 కోట్ల నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.11,884 కోట్లకు పెరిగింది. అంటే 1.7 శాతం వృద్ధి నమోదైంది.
అయితే కంపెనీ నిర్వహణ పనితీరులో స్వల్ప క్షీణత కనిపించింది. గత త్రైమాసికంలో రూ.5,034 కోట్లుగా ఉన్న EBITDA ఈసారి 1.1 శాతం తగ్గి రూ.4,981 కోట్లకు చేరింది. EBITDA మార్జిన్ కూడా 43.1 శాతం నుంచి 41.9 శాతానికి పడిపోయింది.
ARPUలో తగ్గుదల
టెలికాం రంగంలో కీలక సూచికగా భావించే సగటు వినియోగదారుడి ఆదాయం (ARPU) కూడా తగ్గింది. జూన్ త్రైమాసికంలో రూ.195గా ఉన్న ARPU సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.180కి చేరింది.
సెటిల్మెంట్ షేర్ల మార్క్-టు-మార్కెట్ పునఃమూల్యాంకనం కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.462 కోట్ల అసాధారణ నష్టం నమోదైంది. దీనికి భిన్నంగా జూన్ త్రైమాసికంలో రూ.1,611 కోట్ల అసాధారణ లాభం నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది.
పెరిగిన చందాదారుల సంఖ్య
నష్టాలు పెరిగినప్పటికీ వోడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. జూన్ త్రైమాసికంలో 193.1 మిలియన్లుగా ఉన్న మొత్తం వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ త్రైమాసికంలో 194.4 మిలియన్లకు పెరిగింది.
పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల సంఖ్య 31.9 మిలియన్ల నుంచి 33.9 మిలియన్లకు చేరింది. గత తొమ్మిది త్రైమాసికాల్లో ఇదే అత్యధిక త్రైమాసిక పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల చేరికగా కంపెనీ పేర్కొంది.
4G, 5G వినియోగదారుల్లో వృద్ధి
గత ఏడాది ఇదే కాలంలో 127.8 మిలియన్లుగా ఉన్న 4G, 5G వినియోగదారుల సంఖ్య ఈ త్రైమాసికం ముగిసే నాటికి 131 మిలియన్లకు పెరిగింది. అలాగే సగటు రోజువారీ డేటా వినియోగం గత ఏడాదితో పోలిస్తే 27.1 శాతం వృద్ధి చెంది 93.6 పెటాబైట్లకు చేరుకుంది.
నెట్వర్క్ విస్తరణపై దృష్టి
ఈ ఫలితాలపై కంపెనీ సీఈవో అభిజిత్ కిషోర్ స్పందిస్తూ.. సంస్థ ప్రధానంగా వ్యూహాల అమలుపై దృష్టి సారించిందని తెలిపారు. చందాదారుల చేరికలు, నెట్వర్క్ విస్తరణ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం తమ నిర్వహణ పనితీరుకు కీలకమని పేర్కొన్నారు.




