UK Visa: యూకే వీసా ఆంక్షలు.. భారతీయ విద్యార్థులకు నిరాశ!

UK Visa Restrictions: యూకే హోం ఆఫీస్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో బ్రిటీష్ యూనివర్సిటీలు అడ్మిషన్ ఆఫర్లను ఉపసంహరించుకుంటున్నాయి. భారతీయులపై తీవ్ర ప్రభావం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 5:00 AM IST
UK Visa
X

UK Visa: యూకే వీసా ఆంక్షలు.. భారతీయ విద్యార్థులకు నిరాశ!

UK Visa Restrictions: బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల ఆశలపై యూకే (UK) ప్రభుత్వం నీళ్లు చల్లింది. వీసా నిబంధనలను యూకే హోం ఆఫీస్ అత్యంత కఠినతరం చేయడంతో, అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఇచ్చిన్ ఆఫర్ లెటర్లను (Course Offers) వరుసగా ఉపసంహరించుకుంటున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' నివేదిక వెల్లడించింది. విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును ఎక్కడ పూర్తిగా కోల్పోతామోనన్న భయంతో విశ్వవిద్యాలయాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్లేషణలో తేలింది.

5 శాతం పరిమితే ప్రధాన కారణం:

హోం ఆఫీస్ నూతన నిబంధనల ప్రకారం.. ఏదైనా విద్యాసంస్థ ఇచ్చిన ఆఫర్ల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థులలో 5 శాతానికి పైగా వీసాలు తిరస్కరణకు గురైతే, ఆ విశ్వవిద్యాలయంపై విదేశీ విద్యార్థుల చేరికలపై శాశ్వత నిషేధం విధించే ప్రమాదం ఉంది. గతంలో ఉన్న 10 శాతం పరిమితిని యూకే ప్రభుత్వం ఇటీవల 5 శాతానికి తగ్గించడమే ఈ పరిస్థితికి కారణమైంది. స్టూడెంట్ వీసా మార్గాన్ని కొన్ని దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

అయోమయంలో విద్యార్థులు:

యూనివర్సిటీస్ యూకే ఇంటర్నేషనల్ (UUKi) డైరెక్టర్ జేమీ ఆరోస్మిత్ మాట్లాడుతూ.. వీసా దరఖాస్తుల తిరస్కరణకు అస్పష్టమైన, లోపభూయిష్టమైన కారణాలు చూపుతున్నారని, దీంతో నిబంధనల ఉల్లంఘన ముప్పు నుంచి తప్పించుకునేందుకు యూనివర్సిటీలు పెద్ద ఎత్తున ఆఫర్లను రద్దు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కఠిన విధానాల వల్ల విద్యాసంస్థల పటిష్టత దెబ్బతినడమే కాకుండా, విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్