Sugar Production: ఇథనాల్‌కు చక్కెర మళ్లింపుపై నిషేధం.. పెరిగిన ఉత్పత్తి
India Sugar Production: భారత్‌లో చక్కెర ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. ఇథనాల్ తయారీకి చక్కెర మళ్లింపుపై నిషేధం, ధరల పెరుగుదల వివరాలు తెలుసుకోండి.
Sugar Production: ఇథనాల్‌కు చక్కెర మళ్లింపుపై నిషేధం.. పెరిగిన ఉత్పత్తి
Sugar Production: దేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2026-27 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో (ESY2027) మొదటి నెలలోనే చక్కెర ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా నమోదైంది. చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ICRA నివేదిక వెల్లడించింది.
ICRA నివేదిక ప్రకారం.. ESY2027 మొదటి నెలలో దేశీయంగా 1.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (MT) చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్‌లో చక్కెర నిల్వలు తక్కువగా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నప్పటికీ, ఉత్పత్తి మాత్రం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడంపై విధించిన ఆంక్షల వల్ల దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
2027లో 28-29 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనా
2027 చక్కెర సంవత్సరంలో (SY2027) దేశంలో నికర చక్కెర ఉత్పత్తి 28-29 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండవచ్చని ICRA అంచనా వేసింది. 2026 చక్కెర సంవత్సరంలో సుమారు 27.6 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, ఇందులో దాదాపు 3 మిలియన్ మెట్రిక్ టన్నులను ఇథనాల్ తయారీకి మళ్లించారు.
మరోవైపు.. SY2027లో దేశీయ చక్కెర వినియోగం 28.3 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండవచ్చని అంచనా. ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుమతి కోటాను పరిగణనలోకి తీసుకుంటే, ఈ చక్కెర సంవత్సరం చివరి నాటికి దేశంలో 3.5 నుంచి 4.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు మిగిలే అవకాశం ఉంది. అయితే, గత చక్కెర సంవత్సరంలో అంచనా వేసిన 4.8 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలతో పోలిస్తే ఇది తక్కువ.
ఈ నిల్వలు దేశీయ వినియోగానికి రెండు నెలల కంటే తక్కువ కాలం మాత్రమే సరిపోతాయని నివేదిక తెలిపింది. సాధారణంగా రెండు నుంచి మూడు నెలలకు సరిపడా చక్కెర నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుత అంచనాలు అంతకంటే తక్కువగా ఉన్నాయి.
దేశీయ మార్కెట్‌లో పెరిగిన చక్కెర ధరలు
పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్, సరఫరాలో పరిమితుల కారణంగా నవంబర్‌లో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరిగాయి. మహారాష్ట్రలో కిలో చక్కెర ధర రూ.49.1 నుంచి రూ.51.4కు చేరగా, ఉత్తరప్రదేశ్‌లో రూ.51.1 నుంచి రూ.54.8కు పెరిగింది. దేశవ్యాప్తంగా సగటు చక్కెర ధర కిలోకు రూ.51 నుంచి రూ.54.7కు పెరిగినట్లు ICRA వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఉత్పత్తి తగ్గడం, పండుగల సమయంలో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా 2026 అక్టోబర్‌లో చక్కెర ధరలు బలపడ్డాయి. ముడి చక్కెర ధర టన్నుకు 445 డాలర్లకు చేరింది. 2026 సెప్టెంబర్‌లో ఇది 395 డాలర్లుగా ఉండగా, 2025 అక్టోబర్‌లో 343 డాలర్లుగా నమోదైంది.
అదేవిధంగా, తెల్ల చక్కెర ధర టన్నుకు 540 డాలర్లకు పెరిగింది. 2026 సెప్టెంబర్‌లో 519 డాలర్లుగా ఉన్న ధర, ఏడాది క్రితం 440 డాలర్లుగా ఉంది. ముడి చక్కెరతో పోలిస్తే తెల్ల చక్కెర ధరలో ఉన్న వ్యత్యాసం (ప్రీమియం) 2025 అక్టోబర్‌లోని 97 డాలర్ల నుంచి 94 డాలర్లకు తగ్గింది.
20 శాతానికి చేరిన ఇథనాల్ బ్లెండింగ్
ఇదిలా ఉండగా.. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ESY2026లో 20 శాతం లక్ష్యాన్ని కొనసాగించింది. ఈ ఏడాది మొత్తం 1,089 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్ సరఫరా కాగా, 2026 అక్టోబర్ నెలలోనే 102 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా జరిగినట్లు నివేదిక వెల్లడించింది.




