స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ.6.39 లక్షల కోట్లు ఆవిరి!

Stock Market: ఇటీవల రికార్డు స్థాయి ర్యాలీతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్రేక్ పడింది.

G Krishna
Published on: 23 Nov 2026 4:20 PM IST
Stock Market
X

స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ.6.39 లక్షల కోట్లు ఆవిరి!

Stock Market: ఇటీవల రికార్డు స్థాయి ర్యాలీతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ 1.5 శాతానికి పైగా కుప్పకూలాయి. ఈ ప్రభావం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లపైనా పడింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1.77 శాతం నష్టంతో 82,435.99 వద్ద ముగియగా, నిఫ్టీ50 1.75 శాతం పడిపోయి 25,349.65 వద్ద స్థిరపడింది. ఈ ఒక్కరోజు పతనంతో మదుపర్ల సంపదలో రూ.6.39 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

దాంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.508 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ 6 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో నిలిచాయి.

మార్కెట్ కుప్పకూలడానికి ప్రధాన కారణాలు

ఇటీవల షేర్లు భారీగా పెరిగిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం పతనానికి అతిపెద్ద కారణంగా నిలిచింది. 2020 తర్వాత అత్యుత్తమ నెలవారీ పనితీరు దిశగా నిఫ్టీ 10 శాతానికి పైగా ఎగబాకిన తర్వాత, లాభాలను లాక్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.

విదేశీ సంస్థాగత మదుపర్ల రాకతో నిఫ్టీ50 తన జీవితకాల గరిష్ఠమైన 26,373.20కి కేవలం 2 శాతం పైగా దూరంలో, సెన్సెక్స్ తన రికార్డు గరిష్ఠమైన 86,159కి 3 శాతం కంటే తక్కువ దూరంలో నిలిచిన వేళ ఈ అమ్మకాలు జరిగాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎంఈ ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం రేటు పెంపునకు 93 శాతం అవకాశం కనిపిస్తోంది.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రస్తుత రేట్లు సరిపోవని ఫెడ్ గవర్నర్ లిసా కుక్ శుక్రవారం వ్యాఖ్యానించడం కూడా ఇందుకు తోడైంది. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే భారతీయ ఈక్విటీల కంటే అక్కడి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయి.

రూపాయి క్షీణత.. హెవీవెయిట్ షేర్ల అమ్మకాలు

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.50 దాటి 93 స్థాయి వైపు వేగంగా పడిపోవడం మార్కెట్ ఆందోళనలను మరింత పెంచింది. శుక్రవారం రూపాయి 92.67 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడితే ముఖ్యంగా ముడి చమురు దిగుమతి ఖర్చులు పెరిగి దేశీయ కంపెనీలపై భారం పడుతుంది, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి.

అలాగే విదేశీ మదుపర్ల డాలర్ రాబడి తగ్గి, మరింత అమ్మకాలకు దారితీయొచ్చు. దీనికి తోడు హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు 2.5 శాతం వరకు క్షీణించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారిత వెయిటేజీ కారణంగా ఈ షేర్ల నష్టాలు నిఫ్టీపై తీవ్ర ప్రభావం చూపాయి.

మార్కెట్ భవిష్యత్తుపై నిపుణుల అంచనా ఏంటి?

గత వారం చివర్లో ఏఐ బబుల్ ఆందోళనలు, అమెరికా కఠిన ద్రవ్య విధానంతో మొదలైన గ్లోబల్ అమ్మకాల సెగ సోమవారం దేశీయ మార్కెట్లపై పడిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బలహీనమైన ఎఫ్ఐఐ సెంటిమెంట్ మధ్య బ్యాంకింగ్, కమోడిటీ హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు కేంద్రీకృతమయ్యాయన్నారు.

ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ, సెలవుల కారణంగా కుదించుకుపోయిన వారం నేపథ్యంలో మార్కెట్ ఒడుదొడుకులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిశ్రమ ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభం నష్టాలను కొంతమేర తగ్గించాయన్నారు.

డేటా సెంటర్ పెట్టుబడుల స్థిరత్వంపై ఆందోళనలు కొనసాగుతున్నా, ఏఐ పెట్టుబడులపై భారత్‌కు తక్కువ ఎక్స్‌పోజర్ ఉండటం, పటిష్ఠమైన దేశీయ ఆర్థిక వ్యవస్థ వల్ల గ్లోబల్ నష్టాల ప్రభావం ఇక్కడ పరిమితంగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తయారీ రంగం పుంజుకోవడం, రెండో త్రైమాసికంలో సుమారు 7.7 శాతం జీడీపీ వృద్ధి అంచనాలు మధ్య, దీర్ఘకాలికంగా మార్కెట్‌కు సానుకూల బలాన్ని ఇస్తాయని వినోద్ నాయర్ విశ్లేషించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.