రోజుకు రూ.50 ఆదా చేస్తూ.. రూ.20 లక్షలు పొదుపు చేయడం సాధ్యమేనా.?
SIP Investment: భవిష్యత్తు కోసం పొదుపు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం రూ.50 ఆదా చేసినా దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు.
రోజుకు రూ.50 ఆదా చేస్తూ.. రూ.20 లక్షలు పొదుపు చేయడం సాధ్యమేనా.?
SIP Investment: భవిష్యత్తు కోసం పొదుపు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం రూ.50 ఆదా చేసినా దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించి లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.
SIP అంటే ఏమిటి?
SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో పెట్టుబడిదారులు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెడతారు. ఉదాహరణకు నెలకు రూ.1,500 పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే.. ప్రతి నెలా నిర్ణయించిన తేదీన ఆ మొత్తం బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న మొత్తాలతోనే పెట్టుబడి అలవాటు చేసుకోవచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది.
రోజుకు రూ.50 ఆదా చేస్తే ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
రోజుకు రూ.50 చొప్పున ఆదా చేస్తే నెలకు సుమారు రూ.1,500 అవుతుంది. అదే ఏడాదికి రూ.18,000 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా SIP రూపంలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి ఫండ్ సమకూరుతుంది. లైవ్‌మింట్ నివేదికలో పేర్కొన్న అంచనాల ప్రకారం.. ఏడాదికి 10 శాతం రాబడి వస్తుందని భావిస్తే 5 ఏళ్లలో సుమారు రూ.1.18 లక్షలు, 10 ఏళ్లలో రూ.3.14 లక్షలు, 15 ఏళ్లలో రూ.6.35 లక్షలు సమకూరవచ్చు. ఇక 25 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే సుమారు రూ.20.41 లక్షల ఫండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక పెట్టుబడితో కాంపౌండింగ్ ప్రయోజనం
SIP ద్వారా దీర్ఘకాలంలో మంచి ఫండ్ సమకూరడానికి ప్రధాన కారణాల్లో కాంపౌండింగ్ ఒకటి. అంటే మనం పెట్టిన పెట్టుబడిపై వచ్చే లాభాలు కూడా తిరిగి రాబడిని అందిస్తాయి. ఉదాహరణకు రూ.1,000 పెట్టుబడిపై రూ.100 లాభం వస్తే మొత్తం రూ.1,100 అవుతుంది. తర్వాత వచ్చే రాబడి ఈ పెరిగిన మొత్తంపై కూడా లెక్కిస్తారు. ఇలా పెట్టుబడిపై వచ్చే లాభాలు తిరిగి పెట్టుబడిలో భాగమవుతూ కాలక్రమేణా ఫండ్ పెరుగుతుంది. అందుకే తక్కువ మొత్తంతో ప్రారంభించినా ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
చిన్న మొత్తంతో SIP ప్రారంభించే ముందు ఈ జాగ్రత్తలు
తక్కువ ఆదాయం ఉన్నవారు లేదా తొలిసారి పెట్టుబడులు ప్రారంభించాలనుకునేవారు చిన్న SIPతో మొదలుపెట్టవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా నెలవారీ ఆదాయం, ఖర్చులు, ఇతర ఆర్థిక బాధ్యతలను అంచనా వేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు చేసుకోవాలి. కేవలం అధిక రాబడి వస్తుందనే ఆశతో పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న 10 శాతం రాబడి కేవలం అంచనా మాత్రమే. ఇది హామీతో కూడిన రాబడి కాదు. కాబట్టి తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి సరైన ఫండ్‌ను ఎంచుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు సూచనలు పాటించడం మంచిది.




