SBI: పండుగ వేళ కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చేలా MCLR, EBLR, RLLR వడ్డీ రేట్లను పెంచింది.
SBI: పండుగ వేళ కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ
SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రుణ గ్రహీతలకు బిగ్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చేలా కీలక లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేట్లు , రెపో లింక్డ్ లెండింగ్ రేట్లలతో పాటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటులలో మార్పులు చేపట్టింది. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు పెరగనున్నాయి. అంతేకాకుండా కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా అధిక వడ్డీ భారం పడనుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు , రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగిన అక్టోబర్ సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఆర్బీఐ రెపో రేటు 5.25 శాతం నుండి 5.50 శాతానికి చేరింది. దాదాపు మూడేళ్ల వ్యవధి తర్వాత ఆర్బీఐ చేపట్టిన ఈ పెంపుతో బ్యాంకులపై ఆర్థిక భారం పడటంతో, ఆ భారాన్ని సర్దుబాటు చేసే క్రమంలో ఎస్బీఐ వడ్డీ రేట్లను సవరించింది.
తాజా పెంపుతో ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటు 7.90% + CRP + BSP నుండి 8.15% + CRP + BSP కి పెరిగింది. అదేవిధంగా, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 7.50% + CRP నుంచి 7.75% + CRP కి చేరింది. అయితే, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా 14.65 శాతంగానే యథాతథంగా ఉంచడం కొంత ఊరటనిచ్చే అంశం.
బ్యాంకు నిధుల ఆధారిత వడ్డీ రేట్లను పరిశీలిస్తే ఓవర్నైట్, ఒక నెల కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం వద్దే స్థిరంగా ముగిసింది. 3 నెలల వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. 6 నెలల వ్యవధి ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.60 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది. సాధారణ వినియోగదారుల రుణాలకు లింక్ అయి ఉండే 1 సంవత్సరం టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.85 శాతానికి ఎగబాకింది. 2 ఏళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.90 శాతానికి పెరిగింది. 3 ఏళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.
సాధారణంగా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీని పెంచుతాయి. కానీ, ఎస్బీఐ ప్రస్తుతానికి డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి గల డిపాజిట్లపై 3.05 శాతం నుంచి 6.60 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.55 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి.




