రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం కావాలా.. ఈ 3 ప్రభుత్వ పథకాలపై ఓ లుక్కేయండి

Retirement plan: ఉద్యోగం చేస్తున్నంత కాలం ప్రతి నెలా జీతం వస్తుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత జీతం ఆగిపోతుంది.

Mokshith
Published on: 27 Oct 2026 5:20 PM IST
Retirement plan
X

రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం కావాలా.. ఈ 3 ప్రభుత్వ పథకాలపై ఓ లుక్కేయండి

Retirement plan: ఉద్యోగం చేస్తున్నంత కాలం ప్రతి నెలా జీతం వస్తుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత జీతం ఆగిపోతుంది. కానీ ఇంటి ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. నిత్యావసర సరుకులు, విద్యుత్ బిల్లులు, మందుల ఖర్చుల కోసం డబ్బు అవసరమవుతుంది. అందుకే ఉద్యోగంలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళిక వేసుకోవాలి. అలాంటి వారికి ఉప‌యోగ‌ప‌డే 3 బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

పెట్టుబడి పెట్టిన డబ్బుపై ప్రతి నెలా వడ్డీ పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఒకేసారి కొంత మొత్తాన్ని జమ చేయాలి. ఆ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పొందవచ్చు. ఈ పథకానికి ప్రస్తుతం సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ ల‌భిస్తోంది. ఈ లెక్కన రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.3,083 వడ్డీ వస్తుంది. రూ.9 లక్షలు జమ చేస్తే నెలకు సుమారు రూ.5,550 ఆదాయం లభిస్తుంది. ఈ పథకంలో ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలు. భార్యాభర్తలు కలిసి ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తే నెలకు సుమారు రూ.9,250 వడ్డీ పొందవచ్చు. ఈ పథకం గడువు ఐదేళ్లు. ఈ కాలంలో ప్రతి నెలా వడ్డీ అందుతుంది. ఐదేళ్లు పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం అసలు పెట్టుబడిని తిరిగి పొందవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే సమయంలో అప్పటి వడ్డీ రేటు, ఇతర నిబంధనలను పరిశీలించాలి.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మంచి ఎంపికగా ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు నిండినవారు ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. కొన్ని నిబంధనలకు లోబడి 55 ఏళ్లు దాటిన పదవీ విరమణ పొందినవారికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ ల‌భిస్తోంది. ఇందులో గరిష్ఠంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో వడ్డీ ప్రతి నెలా కాకుండా మూడు నెలలకు ఒకసారి అందుతుంది. ఉదాహరణకు, మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి సుమారు రూ.82,000 వడ్డీ వస్తుంది. అంటే ప్రతి మూడు నెలలకు సుమారు రూ.20,500 మీ ఖాతాలో జమ అవుతుంది. అదే గరిష్ఠ పరిమితి అయిన రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి సుమారు రూ.2.46 లక్షల వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకు ఒకసారి రూ.61,500 అందుతుంది. నెలవారీ లెక్కన చూస్తే ఇది సుమారు రూ.20,500కు సమానం. అయితే ఈ మొత్తం ప్రతి నెలా ఖాతాలో జమ కాదు. మూడు నెలలకు ఒకసారి మాత్రమే అందుతుంది. అందువల్ల నెలవారీ ఖర్చుల కోసం ఈ డబ్బును సరిగ్గా ప్రణాళిక చేసుకోవాలి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేటు, గడువు, పన్ను నిబంధనలను తెలుసుకోవడం మంచిది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)

ఉద్యోగం చేస్తున్న సమయంలోనే రిటైర్మెంట్ కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఉపయోగపడుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు. అందువల్ల వచ్చే రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీనికి స్థిరమైన రాబడి ఉంటుందని చెప్పలేం. రిటైర్మెంట్ సమయంలో ఖాతాలో ఉన్న మొత్తం, అప్పటి నిబంధనల ఆధారంగా కొంత మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంలో నిర్దిష్ట భాగాన్ని యాన్యుటీ పథకంలో పెట్టుబడిగా పెట్టాల్సి రావచ్చు. ఈ యాన్యుటీ ద్వారా క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుంది. వర్తించే ఉపసంహరణ నిబంధనలు, యాన్యుటీ ఎంపికలను బట్టి వివరాలు మారుతాయి. ఉదాహరణకు, రిటైర్మెంట్ సమయానికి మీ NPS ఖాతాలో రూ.50 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఇందులో 40 శాతం అంటే రూ.20 లక్షలను యాన్యుటీ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తే, మిగిలిన రూ.30 లక్షల వినియోగం అప్పటి నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. యాన్యుటీపై సంవత్సరానికి 6 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, రూ.20 లక్షలపై ఏడాదికి రూ.1.20 లక్షలు లభిస్తాయి. అంటే నెలకు సుమారు రూ.10,000 పెన్షన్ వచ్చినట్లు లెక్క. అయితే ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. వాస్తవంగా వచ్చే పెన్షన్ యాన్యుటీ పథకం, కొనుగోలు సమయంలోని రేట్లు, ఇతర నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

మీ అవసరాలకు ఏ పథకం సరిపోతుంది?

రిటైర్మెంట్ తర్వాత ఎంత ఆదాయం అవసరమవుతుందో ముందుగా లెక్కించుకోవాలి. ఇంటి ఖర్చులు, మందులు, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాల కోసం నెలకు ఎంత డబ్బు కావాలో అంచనా వేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవాలి. ఇప్పటికే కొంత మొత్తం చేతిలో ఉండి, ప్రతి నెలా వడ్డీ కావాలనుకునే వారికి MIS ఉపయోగపడవచ్చు. మూడు నెలలకు ఒకసారి వడ్డీ వచ్చినా పర్వాలేదనుకునే అర్హులైన వృద్ధులకు SCSS అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్నప్పుడే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలనుకునే వారికి NPS ఒక ఎంపికగా ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.