Real estate: రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందా.? రియల్ రంగంపై షేర్ మార్కెట్ ప్రభావం!
Real estate: షేర్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల ప్రభావం ఇతర పెట్టుబడి రంగాలపైనా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ కొంతమేరకు నెమ్మదించిన పరిస్థితి నమోదైంది.
Real estate: రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందా.? రియల్ రంగంపై షేర్ మార్కెట్ ప్రభావం!
Real estate: షేర్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల ప్రభావం ఇతర పెట్టుబడి రంగాలపైనా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ కొంతమేరకు నెమ్మదించిన పరిస్థితి నమోదైంది. ప్రాపర్టీ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తాజా నివేదిక ప్రకారం.. 2026 మూడో త్రైమాసికంలో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గాయి.
9 నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు
2026 రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలోనూ ఇళ్ల విక్రయాలు 4 శాతం తగ్గాయి. మరోవైపు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల సంఖ్య ఏకంగా 15 శాతం తగ్గింది. Q2లో 1,15,010 కొత్త ఇళ్లు మార్కెట్‌లోకి రాగా.. Q3లో ఈ సంఖ్య 98,165 యూనిట్లకు పడిపోయింది. అయితే కొత్త ఇళ్ల సరఫరా తగ్గినప్పటికీ అమ్మకాలు మాత్రం లక్ష యూనిట్లకు పైనే ఉండటం గమనించాల్సిన విషయం. అంటే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఇళ్ల కంటే అమ్ముడైన ఇళ్ల సంఖ్య సుమారు 5,000 ఎక్కువగా ఉంది. నగరాల వారీగా చూస్తే థానేలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 28 శాతం, చెన్నైలో 22 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 19 శాతం, పుణెలో 17 శాతం తగ్గింది.
పెరిగిన ధరలతో కొనుగోలుదారుల ఆలోచన
ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి షేర్ మార్కెట్ పరిస్థితులు ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. గత కొంతకాలంగా నివాస ప్రాపర్టీల ధరలు గణనీయంగా పెరగడంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌పై ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీంతో వెంటనే ఇల్లు కొనుగోలు చేయకుండా ప్రాజెక్టులు, ధరలు, సౌకర్యాలను పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు.
చెన్నై, పుణె మార్కెట్లపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. చెన్నైలో ఇళ్ల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 17 శాతం, పుణెలో 16 శాతం తగ్గాయి. థానే, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రధాన మార్కెట్లలోనూ అమ్మకాలు తగ్గాయి. అయితే దీన్ని పూర్తిగా డిమాండ్ తగ్గిపోయినట్లు చూడకూడదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గత త్రైమాసికంలో అమ్మకాలు బలంగా ఉండటం వల్ల తర్వాతి త్రైమాసికంలో కొంత మందగమనం సహజమేనని అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి
దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 68 శాతం పెరిగింది. ఇళ్ల అమ్మకాలు కూడా 11 శాతం వృద్ధి చెందాయి. నవి ముంబైలోనూ ఇళ్ల విక్రయాలు పెరగగా.. బెంగళూరు మార్కెట్ దాదాపు స్థిరంగా ఉంది.
హైదరాబాద్‌లో అన్ని ప్రాజెక్టులకు ఒకే స్థాయిలో డిమాండ్ ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు తాము చెల్లించే మొత్తానికి తగిన సౌకర్యాలు, లొకేషన్, నాణ్యత ఉన్నాయా అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మంచి ప్రాంతాల్లో ఉండి, ప్రత్యేకమైన సౌకర్యాలు అందించే ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగుతోంది. సాధారణ ప్రాజెక్టులకు మాత్రం కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎక్కువ సమయం పడుతోంది. అందుకే డెవలపర్లు నగరం మొత్తం పరిస్థితిని కాకుండా ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌ను అర్థం చేసుకుని కొత్త ప్రాజెక్టులను తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పండగ సీజన్‌పై రియల్ ఎస్టేట్ ఆశలు
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం రాబోయే పండగ సీజన్‌పై ఆశలు పెట్టుకుంది. Q3లో కనిపించిన ఈ నెమ్మదింపు తాత్కాలికమా.. లేక ఇల్లు కొనుగోలు చేసే వారి నిర్ణయాల్లో పెద్ద మార్పు వచ్చిందా అనేది పండగ సీజన్‌లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఇళ్ల కొనుగోళ్లు పండగలు, శుభ ముహూర్తాలతో కూడా ముడిపడి ఉంటాయి.
పండగల సమయంలో డెవలపర్లు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడం కూడా కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది. అందువల్ల రాబోయే పండగ సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.




