Plastic Notes: సామాన్యులకు గుడ్‌న్యూస్.. త్వరలో రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు
Plastic Notes: భారత్‌లో త్వరలో రూ.10, రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. 2027 ఏప్రిల్ నుంచి ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
Plastic Currency Notes
Plastic Notes: భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామాన్యుల వాడకంలో ఉండే రూ.10, రూ.20 కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకు చలామణిలో ఉన్న కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్లాస్టిక్ నోట్ల ట్రయల్ రన్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాంకులు ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోయకుండా ఉండేలా ఆర్‌బీఐ ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
సైజ్ మారదు.. ఏటీఎం ఖర్చులు మిగులుతాయి
కొత్తగా రాబోయే ప్లాస్టిక్ నోట్ల పరిమాణం సరిగ్గా ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల పరిమాణంలోనే ఉండనుంది. ఇలా సైజ్ మార్చకుండా ఉంచడం వెనుక పెద్ద కారణమే ఉంది. గతంలో రూ.100, రూ.200 నోట్ల రూపకల్పన సమయంలో సైజ్ మారడంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2.4 లక్షల ఏటీఎం మిషన్లను మార్చాల్సి వచ్చింది. దీనివల్ల ఏటీఎం రంగానికి దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చయింది. ఇప్పుడు రూ.10, రూ.20 నోట్ల సైజ్ మార్చకపోతే బ్యాంకులు ఏటీఎంలలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కోట్లాది రూపాయల ఖర్చు ఆదా అవుతుంది.
నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లు
సాధారణ కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, మురికి పట్టడం జరుగుతుంటుంది. కానీ ఈ ప్రత్యేకమైన పాలిప్రొఫైలిన్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారయ్యే నోట్లు సాధారణ కరెన్సీ కంటే సుమారు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీని విజయవంతంగా వాడుతున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గతంలోనే దీనిపై స్పష్టతనిచ్చారు. భారత్ భిన్నమైన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తొలుత రూ.10, రూ.20 విలువగల ఒక్కో బిలియన్ ప్లాస్టిక్ నోట్లతో ఫీల్డ్ ట్రయల్ నిర్వహించాలని ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఆరు కంపెనీల బిడ్డింగ్.. పర్యావరణ హితమైన తయారీ
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆర్‌బీఐకి చెందిన అనుబంధ సంస్థ BRBNMPL టెండర్లు ఆహ్వానించింది. దీనికోసం యూఫ్లెక్స్ సహా మొత్తం ఆరు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. టెండర్ నిబంధనల ప్రకారం తయారయ్యే ప్రత్యేక ప్లాస్టిక్ షీట్లలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదా డీఎన్ఏ అవశేషాలు ఉండకూడదు. అలాగే సిరా బాగా అతుక్కునేలా ప్రత్యేక కోటింగ్ కూడా ఉండాలి. ప్రస్తుతానికి ఈ ప్లాస్టిక్ నోట్లను బ్యాంక్ బ్రాంచ్‌ల కౌంటర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేసి పరిశీలించాలని భావిస్తున్నారు.




