RBI: సామాన్యులపై మరో భారం.. త్వరలో వడ్డీ రేట్లను పెంచనున్న రిజర్వ్ బ్యాంక్
RBI: దీపావళికి ముందు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. రాబోయే ఎంపీసీ సమావేశంలో రేపో రేటు పెరిగితే హోమ్ లోన్లు, ఇతర రుణాల ఈఎంఐలు భారీగా భారం కానున్నాయి.
rbi repo rate
RBI: దేశంలోని రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో పెద్ద షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాబోయే దీపావళి పండగ కంటే ముందే వడ్డీ రేట్లను పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అక్టోబర్ సమావేశం జరగనున్న నేపథ్యంలో రేపో రేటు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ బిజినెస్ స్టాండర్డ్ పోల్ ప్రకారం 10 మంది అర్థశాస్త్రవేత్తలలో ఎనిమిది మంది వడ్డీ రేట్లు పావు శాతం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న రేపో రేటు ఐదున్నర శాతానికి చేరుకునే ఛాన్స్ ఉంది.
ఎంపీసీ సమావేశం, పాలసీ ప్రకటన
ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ఎంపీసీ కీలక సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరుగనుంది. చర్చల ముగింపు రోజున అంటే అక్టోబర్ 7న నూతన పాలసీ వివరాలను గవర్నర్ అధికారికంగా వెల్లడించనున్నారు. గత నాలుగు దఫాలుగా రిజర్వ్ బ్యాంక్ రేపో రేటును ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచింది. అంతకుముందు గత సంవత్సరంలో వడ్డీ రేట్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈసారీ పావు శాతం పెంపు జరిగితే సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రేట్లు పెంచినట్లవుతుంది.
ద్రవ్యోల్బణం ప్రభావం, ఆర్థిక సవాళ్లు
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణమే ఈ వడ్డీ రేట్ల పెంపునకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యాల కంటే ఎగువనే కొనసాగుతోంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల వినియోగదారుల సెక్టార్‌పై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోంది. అదే సమయంలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేరకు పటిష్టంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థిక కార్యకలాపాలను సమతుల్యం చేయడం మధ్య రిజర్వ్ బ్యాంక్ పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది.
రూపాయి విలువ పతనం, విదేశీ ప్రభావం
అమెరికా డాలర్‌తో పోలిస్తే ఈ ఏడాది భారత రూపాయి విలువ బలహీనపడటం మరో ముఖ్యమైన అంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిణామాలు, విదేశీ పెట్టుబడుల సరళి ఆర్బీఐ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను సర్దుబాటు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు కేంద్ర బ్యాంకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది.
లోన్ ఈఎంఐలపై పడే భారం
ఆర్బీఐ రేపో రేటును పెంచితే బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు మరింత ప్రియంగా మారతాయి. ముఖ్యంగా రెపో రేటుకు అనుసంధానించబడిన ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లు, ఆటో లోన్లు, ఇతర వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ మొత్తం పెరిగే అవకాశం ఉంది. అయితే వాస్తవ వయాదాల పెంపు ఆయా బ్యాంకులు అనుసరించే నిబంధనలు, కస్టమర్ల లోన్ అగ్రిమెంట్లపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.




