ఆర్బీఐ రేటు పెంపు.. మీ EMI ఎంత పెరుగుతుందంటే?
ఆర్బీఐ MPC సమావేశంలో రెపో రేటు పెంపుపై అంచనాలు. రేటు పెరిగితే హోమ్ లోన్ EMI, FD వడ్డీపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
RBI MPC Meet
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార ధరలు, ముడిచమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రెపో రేటుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.8 శాతానికి చేరింది. ఇది ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. వరుసగా మూడు నెలలుగా ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే ఉండటంతో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెసర్జెంట్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాశ్ గాడియా మాట్లాడుతూ.. అంతర్జాతీయ అనిశ్చితులు, పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి సవాలుగా మారాయని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఆహార ధరలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవన లోటు 13 శాతంగా ఉండటంతో రానున్న నెలల్లో ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గృహ రుణాలపై ప్రభావం ఎంత?
బ్యాంక్‌బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి ప్రకారం.. ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచితే గృహ రుణాలపై ప్రభావం ఉంటుంది. అయితే ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని తెలిపారు.
ఉదాహరణకు రూ.50 లక్షల గృహ రుణాన్ని 7.5 శాతం వడ్డీతో 25 ఏళ్ల కాలానికి తీసుకున్నట్లయితే ప్రస్తుతం నెలకు సుమారు రూ.36,950 EMI చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 0.25 శాతం పెరిగితే EMI సుమారు రూ.817 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం రుణ కాలవ్యవధిలో దాదాపు రూ.2.45 లక్షల అదనపు వడ్డీ భారం పడొచ్చని ఆయన తెలిపారు.
రెపో రేటుతో అనుసంధానమైన రుణాల వడ్డీ రేట్లు కొన్ని నెలల్లో రీసెట్ కావచ్చు. అందువల్ల రుణగ్రహీతలు ముందుగానే చర్యలు తీసుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. EMIని కొంత పెంచడం లేదా ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని పార్ట్ ప్రీపేమెంట్ చేయడం ద్వారా మొత్తం వడ్డీని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
FDలపై ప్రభావం ఎలా ఉంటుంది?
రెపో రేటు పెరిగినా ఇప్పటికే బుక్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణంగా ప్రభావం ఉండదు. డిపాజిట్ మెచ్యూర్ అయ్యే వరకు బుక్ చేసిన సమయంలో ఉన్న వడ్డీ రేటే కొనసాగుతుంది. అయితే కొత్తగా చేసే FDలు లేదా మెచ్యూర్ అయిన తర్వాత రిన్యూ చేసే డిపాజిట్లకు అధిక వడ్డీ రేటు లభించే అవకాశం ఉంటుంది.
ఆర్బీఐ అక్టోబర్ 7న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచితే, మార్పు తర్వాత బుక్ చేసే రూ.10 లక్షల డిపాజిట్‌పై ఏడాదికి సుమారు రూ.2,500 అదనపు వడ్డీ లభించే అవకాశం ఉందని ఆదిల్ శెట్టి తెలిపారు. అయితే దీనిపై పన్ను ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.




