కేంద్ర ప్రభుత్వ పథకం.. చిన్న వ్యాపారాలకు రూ.20 లక్షల వరకు రుణం.. ఎవరు అర్హులంటే?

PM Mudra Yojana: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి ముద్రా యోజన ఒకటి. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.

Mokshith
Published on: 28 Nov 2026 4:33 PM IST
PM Mudra Yojana
X

కేంద్ర ప్రభుత్వ పథకం.. చిన్న వ్యాపారాలకు రూ.20 లక్షల వరకు రుణం.. ఎవరు అర్హులంటే?

PM Mudra Yojana: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి ముద్రా యోజన ఒకటి. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే ఏమిటి?

చిన్న వ్యాపారులు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY)ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి చిన్న, సూక్ష్మ వ్యాపారాలకు రుణాలు అందిస్తారు.

ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు. వ్యాపార అవసరాలు, రుణం తీసుకునే కేటగిరీ ఆధారంగా ఎంత మొత్తం మంజూరు చేయాలనేది నిర్ణయిస్తారు. ముద్రా రుణాలు నాలుగు రకాలుగా ఉంటాయి. శిశులో రూ. 50 వేల వరకు రుణం అందిస్తారు. కిశోర్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తారు.

ఇక త‌రుణ్‌లో అయితే రూ. 5 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ.10 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ ప్లస్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ.20 లక్షల వరకు రుణం ఇస్తారు. అయితే తరుణ్ ప్లస్ కేటగిరీ కింద రూ.20 లక్షల వరకు రుణం పొందాలంటే గతంలో తరుణ్ కేటగిరీలో రుణం తీసుకుని, దానిని పూర్తిగా చెల్లించి ఉండాలి. ఈ కొత్త కేటగిరీ 2024 అక్టోబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

ఎవరు అర్హులు? ఏ వ్యాపారాలకు రుణం లభిస్తుంది?

భారతీయ పౌరులు కొత్తగా ఆదాయాన్ని సంపాదించే వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వ్యాపారానికి సంబంధించిన సరైన ప్రణాళిక ఉండాలి.

బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం పొందేందుకు అర్హత సాధించాలి. ఈ పథకం కింద పలు రకాల వ్యాపారాలకు రుణాలు అందిస్తారు. చిన్న దుకాణాలు, కిరాణా షాపులు, ట్రేడింగ్ వ్యాపారాలు. తయారీ రంగానికి చెందిన చిన్న పరిశ్రమలు. సర్వీస్ సెక్టార్ వ్యాపారాలు. టైలరింగ్, బ్యూటీ పార్లర్లు. ఫుడ్ బిజినెస్, క్యాటరింగ్ యూనిట్లు. డెయిరీ, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు.

మహిళా వ్యాపారవేత్తలు కూడా ఈ పథకం కింద రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రూ.20 లక్షల రుణం అందరికీ ఒకేసారి మంజూరు కాదు. వ్యాపార అవసరాలు, అర్హతలను బట్టి బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.

ముద్రా రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ముద్రా యోజన కింద రుణం పొందాలనుకునేవారు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, NBFCలు, మైక్రోఫైనాన్స్ సంస్థలను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు జనసమర్థ్ పోర్టల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్ https://www.jansamarth.in.

అప్లై చేసుకునే స‌మ‌యంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యాపారానికి సంబంధించిన వివరాలు, అవసరాన్ని బట్టి వ్యాపార ప్రణాళిక (Business Plan). అయితే ఏయే పత్రాలు సమర్పించాలనేది బ్యాంకు, రుణం కేటగిరీని బట్టి మారవచ్చు. దరఖాస్తు చేసినంత మాత్రాన రుణం మంజూరు కాదు. బ్యాంకు అధికారులు వ్యాపార వివరాలు, ఆదాయ అవకాశాలు, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాత రుణంపై నిర్ణయం తీసుకుంటారు.

రుణంపై వడ్డీ, ఈఎంఐ చెల్లింపుల వివరాలు

ముద్రా యోజన కింద ఇచ్చే రుణం ఉచిత ఆర్థిక సాయం కాదు. ఇది బ్యాంకులు అందించే వ్యాపార రుణం. దీనిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, ఈఎంఐ వంటి నిబంధనలను రుణం ఇచ్చే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నిర్ణయిస్తుంది.

రుణం తీసుకున్నవారు ప్రతి నెల నిర్ణయించిన తేదీన ఈఎంఐ చెల్లించాలి. ఇందుకోసం బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ (NACH/ECS), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి చెల్లించవచ్చు.

ఒకవేళ రుణాన్ని గడువు కంటే ముందే పూర్తిగా చెల్లించాలనుకుంటే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఫోర్‌క్లోజర్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి. ఇందులో మిగిలిన అసలు మొత్తం, వడ్డీ, వర్తించే ఇతర ఛార్జీల వివరాలు ఉంటాయి. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ (NDC) లేదా లోన్ క్లోజర్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ముద్రా రుణాలు సాధారణంగా అదనపు ఆస్తిని తాకట్టు పెట్టకుండా (Collateral Free) అందిస్తారు. అయితే రుణం మంజూరు చేయడం పూర్తిగా బ్యాంకు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు వడ్డీ రేటు, చెల్లింపు గడువు, ఇతర నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.