Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

Petrol Price Hike: దేశంలో వాహనదారులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.

CR Reddy
Published on: 16 Oct 2026 7:53 AM IST
Petrol Price Hike
X

Petrol Price Hike

Petrol Price Hike: దేశంలో వాహనదారులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచే ఆలోచనలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే రేట్లు సవరించడానికి ఇదే చివరి ఆచరణాత్మక అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ నష్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది.

చమురు కంపెనీలకు భారీ నష్టాలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అలాగే మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్ 110 డాలర్ల మార్కును దాటింది. దీనివల్ల దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.8లు, డీజిల్‌పై దాదాపు రూ.9ల మేర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేయడానికి రాబోయే రోజుల్లో ధరల పెంపు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకేసారి భారీగా కాకుండా ఈ ఏడాది మే నెలలో జరిగిన పెంపుతో పోలిస్తే సగం శాతంలో ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు హెచ్చరిక

ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు గరిష్ట స్థాయికి చేరితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి, అలాగే 2027 మొదటి త్రైమాసికంలో 6.5 శాతానికి ఎగబాకే అవకాశం ఉంది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2%-6% సురక్షిత పరిమితిని దాటిపోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ రాబోయే డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాలలో రెపో రేటును మరో 0.25 శాతం వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గృహ, వాహన రుణాల ఈఎంఐలు మరింత ప్రిమయ్యే ప్రమాదం ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లోని ధరలు

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (HPCL, IOCL, BPCL) ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.12 ఉండగా, డీజిల్ ధర రూ. 95.20 వద్ద స్థిరంగా ఉంది. ఇక దేశంలోనే అత్యంత చౌకగా పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ. 88.66, డీజిల్ రూ. 84.56గా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో అత్యధికంగా పెట్రోల్ రూ. 118.34, డీజిల్ రూ. 106.06 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర సుమారు రూ. 107.41 ఉండగా, డీజిల్ ధర రూ. 95.65 వద్ద కొనసాగుతోంది. త్వరలో జరిగే రేట్ల సవరణతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.