Gold Loans vs Personal Loans: బంగారు రుణాల స్థానాన్ని వ్యక్తిగత రుణాలు భర్తీ చేస్తాయా?
Gold Loans vs Personal Loans: భారత్‌లో వ్యక్తిగత రుణాలు మళ్లీ పుంజుకుంటున్నాయని UBS నివేదిక తెలిపింది. బంగారు రుణాలను అధిగమించి వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా.
Gold Loans vs Personal Loans: బంగారు రుణాల స్థానాన్ని వ్యక్తిగత రుణాలు భర్తీ చేస్తాయా?
Gold Loans vs Personal Loans: భారత్‌లో రుణాల మార్కెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా వేగంగా పెరిగిన బంగారు రుణాల స్థానాన్ని వ్యక్తిగత రుణాలు భర్తీ చేసే అవకాశం ఉందని UBS Global Research నివేదిక పేర్కొంది.
రెండేళ్లపాటు మందగించిన వ్యక్తిగత రుణాలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయని, దీంతో దేశంలోని అసురక్షిత రుణాల విభాగం కొత్త వృద్ధి దశలోకి అడుగుపెడుతోందని నివేదిక అభిప్రాయపడింది.
రూ.18.6 లక్షల కోట్లకు బంగారు రుణాలు
2026 ఆర్థిక సంవత్సరంలో బంగారు రుణాలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 50 శాతం పెరిగి రూ.18.6 లక్షల కోట్లకు చేరుకున్నట్లు UBS తెలిపింది.
GDPలో బంగారు రుణాల వాటా కూడా FY2019లో ఉన్న 1 శాతం నుంచి ప్రస్తుతం 5 శాతానికి పెరిగింది. అంటే కేవలం కొన్నేళ్లలో ఈ విభాగం వాటా దాదాపు ఐదు రెట్లు పెరిగింది.
అయితే బంగారం ధరలు భారీగా పెరగడం కూడా ఈ వృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదల వేగం తగ్గడంతో, బంగారు రుణాల వృద్ధి కూడా క్రమంగా మందగించే అవకాశం ఉందని UBS అంచనా వేసింది.
NBFCలకు బంగారు రుణాల్లో భారీ వృద్ధి
బంగారు రుణాల మార్కెట్లో NBFCలు కూడా దూకుడుగా విస్తరించాయి. FY2018లో ఈ విభాగంలో NBFCల వాటా కేవలం 3 శాతంగా ఉండగా, ఆగస్టు నాటికి అది 20 శాతానికి చేరుకుంది.
అంటే ఈ విభాగంలో NBFCల వాటా ఆరేళ్లలో ఆరు రెట్లకు పైగా పెరిగింది. అయితే బంగారం ధరల పెరుగుదల వంటి వృద్ధికి దోహదపడిన అంశాలు క్రమంగా బలహీనపడటంతో, ఇకపై వాటా పెరుగుదల వేగం కూడా తగ్గవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.
మళ్లీ పుంజుకుంటున్న వ్యక్తిగత రుణాలు
ఇదే సమయంలో వ్యక్తిగత రుణాల విభాగంలో వృద్ధి వేగం పెరుగుతోంది. ఆగస్టు వరకు NBFCల వ్యక్తిగత రుణాల వృద్ధి దాదాపు 30 శాతానికి చేరుకోగా, బ్యాంకుల వ్యక్తిగత రుణాల వృద్ధి సుమారు 9 శాతంగా నమోదైంది.
గత రెండేళ్లలో ఈ రెండు విభాగాల్లోనూ ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి అని UBS నివేదిక పేర్కొంది.
నియంత్రణలు కఠినతరం కావడం, రుణగ్రహీతలపై రుణభారం పెరగడం వంటి కారణాలతో గతంలో వ్యక్తిగత రుణాల వృద్ధి మందగించింది. ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతుండటంతో ఈ విభాగం మళ్లీ వేగం పుంజుకుంటున్నట్లు నివేదిక సూచిస్తోంది.
వ్యక్తిగత రుణాల్లో బకాయిలు తగ్గాయి
వ్యక్తిగత రుణాల విషయంలో 30 రోజుల బకాయిలు కూడా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. జూన్ 2024లో 3.5 శాతంగా ఉన్న 30 రోజుల బకాయిలు.. ఆగస్టు 2026 నాటికి 1.8 శాతానికి తగ్గాయి.
మరోవైపు బంగారు రుణాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మార్చిలో 0.7 శాతంగా ఉన్న బకాయిలు ఆగస్టు నాటికి 2.6 శాతానికి పెరిగినట్లు UBS పేర్కొంది.
వడ్డీ రేట్ల ప్రభావం ఎంత?
వడ్డీ రేట్లలో పెరుగుదల వచ్చినా వ్యక్తిగత రుణాల పుంజుకుంటున్న ధోరణి పూర్తిగా మారకపోవచ్చని UBS అంచనా వేసింది.
డెరివేటివ్స్ మార్కెట్ అంచనా వేస్తున్న 100 బేసిస్ పాయింట్ల పెంపుతో పోలిస్తే, 2026 క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి కేవలం 50 బేసిస్ పాయింట్ల మేర స్వల్ప రేట్ల పెంపు ఉండొచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.
మొత్తంగా చూస్తే, బంగారం ధరల ఆధారంగా వేగంగా పెరిగిన బంగారు రుణాల వృద్ధి కొంత నెమ్మదించే సమయంలో.. వ్యక్తిగత రుణాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయని UBS నివేదిక సూచిస్తోంది.




