Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి ఉన్నా ధరలు భగ్గుమనడానికి అసలు కారణం ఇదే!
Onion Price Hike: దేశంలో మళ్లీ భగ్గుమంటున్న ఉల్లిపాయల ధరలు. మార్కెట్‌లో కిలో రూ.70 వరకు విక్రయం.
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి ఉన్నా ధరలు భగ్గుమనడానికి అసలు కారణం ఇదే!
Onion Price Hike: భారతీయ వంటకాల్లో ప్రధాన భాగమైన ఉల్లిపాయల ధరలు మరోసారి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం బఫర్ స్టాక్ ద్వారా రాయితీ ధరకు విక్రయిస్తున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో ధరలు మాత్రం చుక్కలను తాకుతున్నాయి. దేశంలోని పలు మార్కెట్లలో కిలో ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం (సెప్టెంబర్ 16) నాటికి దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సగటు చిల్లర ధర కిలోకు రూ.53.84గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర కేవలం రూ.27.71గా ఉండగా.. ఏడాది వ్యవధిలో ఉల్లి సగటు చిల్లర ధర దాదాపు 94 శాతం పెరగడం గమనార్హం. ఇక అదే రోజు సగటు టోకు ధర కిలోకు రూ.45.65గా నమోదైంది.
ఉల్లి ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24 నుంచే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద బఫర్ ఉల్లిపాయలను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. NCCF, NAFED, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయిస్తున్నారు. అయితే, ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను తరలించడంలో రవాణా, పంపిణీ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రాయితీ ఉల్లి అన్ని మార్కెట్లకు, ప్రతీ వినియోగదారుడికి సమానంగా చేరకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ప్రజలు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం బఫర్ స్టాక్ సరఫరాను దేశవ్యాప్తంగా 19 నగరాలకు విస్తరించింది. రైల్వే ర్యాక్‌లు, ‘కాండా ఎక్స్‌ప్రెస్’, 30కి పైగా ట్రక్కులను వినియోగిస్తూ నాసిక్ తదితర ప్రాంతాల నుంచి ఢిల్లీ, చెన్నై వంటి ప్రాంతాలకు ఉల్లిని తరలిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 1.21 లక్షల టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది. 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 2 లక్షల టన్నుల రబీ ఉల్లిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, క్వింటాల్‌కు రూ.1,875 నుంచి రూ.2,125 చొప్పున కొనుగోలు చేస్తోంది.
రబీ సీజన్‌లో నిల్వ చేసిన ఉల్లిపాయలు క్రమంగా తగ్గిపోతుండగా, కొత్త ఖరీఫ్ పంట మార్కెట్‌కు చేరేందుకు కొంత సమయం పడుతుంది. సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య ఉండే ఈ కొరత కాలమే ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో విత్తనాలు వేయడం ఆలస్యం కావడం, కర్ణాటకలోని చిత్రదుర్గ-చల్లకెరె ప్రాంతంలో సాధారణ సాగులో కేవలం 60 శాతమే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఉల్లి ఉత్పత్తి సరిపడా (2025-26లో అంచనా 30.737 మిలియన్ టన్నులు) ఉన్నప్పటికీ.. సరైన సమయంలో, సరైన ప్రాంతాలకు పంపిణీ జరగకపోవడం, రవాణా సవాళ్లు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
కొత్త ఖరీఫ్ పంట పూర్తిస్థాయిలో మార్కెట్‌కు చేరితేనే ఉల్లి ధరలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




