NSE market: ఎల్‌ఐసీ, ఇన్ఫోసిస్‌ను వెనక్కి నెట్టిన ఎన్‌ఎస్‌ఈ షేర్లు.. ఇన్వెస్టర్లకు పండగే..!

NSE market: దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అద్భుతమైన ప్రయాణంతో రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది.

Gagan kumar
Published on: 17 Nov 2026 12:30 PM IST
NSE market
X

NSE market: ఎల్‌ఐసీ, ఇన్ఫోసిస్‌ను వెనక్కి నెట్టిన ఎన్‌ఎస్‌ఈ షేర్లు.. ఇన్వెస్టర్లకు పండగే..!

National Stock Exchange: ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతల మధ్య కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంటే ఇక్కడ ఒక అసలైన రికార్డు బద్దలైంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ మన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అద్భుతమైన ప్రయాణంతో రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అవలీలగా అధిగమించింది. ఒకానొక దశలో ఐపీఓ సమయంలో నిరాశపరిచిన ఎన్‌ఎస్‌ఈ షేరు.. నేడు ఏకంగా టాప్-10 దిగ్గజ కంపెనీల జాబితాలోకి దూసుకెళ్లింది.

దేశీయ మార్కెట్లలో విదేశీ కొనుగోలుదారుల మద్దతు, ముడి చమురు ధరల తగ్గింపు వంటి సానుకూల పరిణామాల మధ్య ఎన్‌ఎస్‌ఈ స్టాక్ అదరగొడుతోంది. కిందటి సెషన్‌లో దాదాపు 4 శాతం పెరిగి రూ. 2,070 వద్ద ముగిసిన ఈ షేరు.. ఇవాళ నవంబర్ 17న మరో 3 శాతం ఎగబాకి ఇంట్రాడేలో ఏకంగా రూ. 2,134 వద్ద సెషన్ గరిష్ఠాన్ని, సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

ప్రస్తుతం దాదాపు 2.50 శాతం లాభంతో రూ. 2,125 వద్ద ట్రేడవుతోంది. ఐపీఓ సమయంలో రూ. 1785 ఇష్యూ ధరతో సెప్టెంబర్ 24న లిస్టయిన ఈ షేరు.. అక్టోబర్‌లో రూ. 1,640 కనిష్ట స్థాయికి పడిపోయింది. కానీ అక్కడి నుంచి కోలుకుని కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 30 శాతానికి పైగా లాభాలతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. బ్రోకరేజీల అంచనాలు, బలమైన భవిష్యత్ లాభాల కారణంగా గత 4 రోజుల్లోనే ఏకంగా 10 శాతం దూసుకెళ్లింది.

ఈ అద్భుతమైన రాలీతో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ. 5.30 లక్షల కోట్లకు చేరింది. కంపెనీ లిస్టయిన తర్వాత ఈ మార్కును తాకడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఒక్క దూకుడుతో మార్కెట్ విలువ పరంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న దిగ్గజ కంపెనీలను ఎన్‌ఎస్‌ఈ వెనక్కి నెట్టింది.

ఒకప్పుడు టాప్-10లో ఉన్న ఇన్ఫోసిస్ ప్రస్తుతం 14వ స్థానానికి పడిపోయింది.ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ విలువను సైతం దాటేసి ఎన్‌ఎస్‌ఈ 11వ స్థానానికి, అలా నేరుగా టాప్-10 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ టాపర్స్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, జియో ప్లాట్‌ఫామ్స్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతుండగా ఎన్‌ఎస్‌ఈ తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

మొత్తానికి చూస్తే ఒకప్పుడు చిన్న చూపు చూసిన వాళ్లకే ఇదొక పెద్ద సర్ప్రైజ్. బ్రోకరేజీల బలమైన రేటింగ్‌లు, భవిష్యత్ వ్యాపార వృద్ధిపై అంచనాలు ఎన్‌ఎస్‌ఈ షేర్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ గా మారుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.