Middle East Crisis: గల్ఫ్ ప్రయాణికులకు అలర్ట్.. విమాన సర్వీసుల్లో మార్పులు

Middle East Crisis: మధ్యప్రాచ్యంలో అస్థిరత కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేశాయి.

Naresh.k
Published on: 2 April 2026 10:16 AM IST
Middle East Crisis: Air India and IndiGo Issue Travel Advisory for April 2, 2026
X

Middle East Crisis

Air India and IndiGo: మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, అస్థిరత ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు ఇండిగో, ఏప్రిల్ 2, 2026 నాటి ప్రయాణాలకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ , ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు, అక్కడి నుండి వచ్చే వారు తమ ప్రయాణ ప్రణాళికలను సరిచూసుకోవాలని సూచించాయి.

నేటి విమాన సర్వీసుల పరిస్థితి ఏమిటి?

నేడు (02 ఏప్రిల్ 2026, గురువారం) పశ్చిమ ఆసియా ప్రాంతానికి మొత్తం 34 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రకటించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 18 ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. అయితే, ఇవి బయలుదేరే స్టేషన్లలో లభించే స్లాట్లు మరియు అక్కడి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు పాక్షికంగా విమానాలు పునరుద్ధరించబడగా.. జెడ్డా, రియాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.

ప్రయాణాలు యధావిధిగా..

గల్ఫ్ రీజియన్‌లో అంతరాయాలు ఉన్నప్పటికీ, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఉత్తర అమెరికా ,యూరప్ , ఆస్ట్రేలియా దేశాలకు నడిచే అంతర్జాతీయ విమానాలు ఎటువంటి మార్పులు లేకుండా షెడ్యూల్ ప్రకారం యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ప్రయాణికులకు అదిరిపోయే వెసులుబాటు

విమానాల రద్దు లేదా అంతరాయాల వల్ల ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం విమానయాన సంస్థలు ఉదారమైన విధానాలను ప్రకటించాయి. ఎటువంటి అదనపు రుసుము లేకుండా భవిష్యత్తు తేదీలకు విమానాన్ని మార్చుకోవచ్చు. ప్రయాణం రద్దు చేసుకోవాలనుకునే వారికి పూర్తి డబ్బు వెనక్కి ఇవ్వబడుతుంది. UAEలోని ఏ నగరం నుండి అయినా భారతదేశంలోని ఏ గమ్యస్థానానికైనా నడిచే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సీటు పొందే అవకాశం కల్పించారు. ప్రయాణికులు ఎయిర్‌లైన్ కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సాయం పొందవచ్చు.

airindia.com ద్వారా రీబుకింగ్ అభ్యర్థనలు పంపవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు +91 63600 12345 నంబర్‌కు వాట్సాప్ చేసి, AI అసిస్టెంట్ టియా ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. విమానాల్లో మార్పులు ఉంటే ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు మెసేజ్ లేదా కాల్ ద్వారా సమాచారం అందుతుంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతున్నందున, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవడం ఉత్తమం. ఇండిగో వంటి సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, భద్రతకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నాయి.

Naresh.k

Naresh.k

Next Story