Meta: మెటాకు దిమ్మతిరిగే షాక్.. యూజర్ డేటా ప్రైవసీ కేసులో కోట్ల జరిమానా.. ఎందుకంటే?

Meta: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యూజర్ల వ్యక్తిగత డేటా వినియోగం, థర్డ్‌పార్టీ యాప్స్‌కు సమాచారం అందుబాటు

Venkat
Published on: 23 Oct 2026 12:13 PM IST
Meta
X

Meta: మెటాకు దిమ్మతిరిగే షాక్.. యూజర్ డేటా ప్రైవసీ కేసులో కోట్ల జరిమానా.. ఎందుకంటే?

Meta: ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మాతృసంస్థ మెటా (Meta)కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. యూజర్ల వ్యక్తిగత డేటా, ప్రైవసీకి సంబంధించిన కేసులో న్యూ మెక్సికో కోర్టు కంపెనీపై 25 బిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీ విధించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 2.36 లక్షల కోట్లు. అయితే ఈ మొత్తాన్ని మెటా వెంటనే చెల్లించాల్సిందేనని భావించడం సరికాదు. కంపెనీ ఇప్పటికే తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఈ వ్యవహారం మరింత కాలం న్యాయపోరాటంగా కొనసాగే అవకాశం ఉంది.

అసలు కేసు ఏంటి?

న్యూ మెక్సికో రాష్ట్రం 2021లో మెటాపై కేసు దాఖలు చేసింది. ఫేస్‌బుక్ తన యూజర్లకు వ్యక్తిగత సమాచార భద్రత, డేటా వినియోగం గురించి సరైన సమాచారం ఇవ్వలేదన్నది రాష్ట్రం ప్రధాన ఆరోపణ. థర్డ్‌పార్టీ యాప్స్ ద్వారా యూజర్ల సమాచారానికి పెద్ద ఎత్తున యాక్సెస్ లభించినప్పటికీ, డేటాపై తమకు నియంత్రణ ఉందన్న భావనను వినియోగదారుల్లో కంపెనీ కల్పించిందని ఆరోపించింది.

కేసు విచారణలో మెటా చేసిన పలు ప్రకటనలు, ప్రైవసీ విధానాలు పరిశీలనకు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం, ద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించేందుకు కంపెనీ తీసుకున్న చర్యలపై చేసిన ప్రకటనలపైనా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆ వివాదంతో లింక్..

ఈ కేసు ప్రస్తావన వచ్చినప్పుడు కేంబ్రిడ్జి అనలిటికా వివాదం కూడా గుర్తుకు వస్తుంది. 2018లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో సుమారు 8.7 కోట్ల ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌కు సంబంధించిన డేటా థర్డ్‌పార్టీ యాప్ ద్వారా పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమాచారాన్ని రాజకీయ ప్రకటనల లక్ష్యీకరణలో ఉపయోగించినట్లు అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

న్యూ మెక్సికో కేసు కేవలం కేంబ్రిడ్జి అనలిటికా ఘటనపైనే ఆధారపడలేదు. మెటా ప్రైవసీ గురించి చేసిన ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్స్‌కు డేటా యాక్సెస్, ప్లాట్‌ఫామ్‌లో హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన అంశాలు కూడా విచారణలో భాగమయ్యాయి.

4.39 కోట్ల ఉల్లంఘనలు ఎలా వచ్చాయి?

ఈ కేసులో జరిమానా ఇంత భారీగా మారడానికి ఉల్లంఘనల సంఖ్య కీలకంగా మారింది. న్యూ మెక్సికో చట్టం ప్రకారం ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రతి ఉల్లంఘనకు గరిష్ఠంగా 5,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీ విధించే అవకాశం ఉంది.

జ్యూరీ సుమారు 4.39 కోట్ల ఉల్లంఘనలను గుర్తించింది. మెటా చేసిన తప్పుదారి పట్టించే ప్రకటనలను చూసిన లేదా వాటి ప్రభావానికి లోనైన వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఉల్లంఘనలను లెక్కించవచ్చని రాష్ట్రం వాదించింది.

రాష్ట్రం తొలుత 35 నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు జరిమానా కోరింది. మెటా మాత్రం అంత భారీ మొత్తం అన్యాయమని వాదించింది. విచారణ సమయంలో 219 బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరికి కోర్టు 25 బిలియన్ డాలర్ల పెనాల్టీని నిర్ణయించింది.

మెటా ఏం చెబుతోంది?

తీర్పుపై మెటా అప్పీల్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. యూజర్లను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించలేదని కంపెనీ వాదిస్తోంది. అలాగే న్యూ మెక్సికో రాష్ట్రం చేసిన ఆరోపణలను పూర్తిస్థాయిలో నిరూపించలేదని పేర్కొంది.

అప్పీల్‌లో ఉల్లంఘనల లెక్కింపు విధానం, రాష్ట్ర వినియోగించిన చట్టం, జరిమానా మొత్తం వంటి అంశాలను మెటా సవాల్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం ప్రకటించిన ₹2.36 లక్షల కోట్ల మొత్తమే తుది చెల్లింపు అని చెప్పలేం.

సాధారణ సోషల్ మీడియా యూజర్లకు ఏం నేర్పుతోంది?

ఈ కేసు సోషల్ మీడియా వినియోగదారులకు కూడా ముఖ్యమైన విషయం చెబుతోంది. ఫేస్‌బుక్ లేదా ఇతర యాప్స్‌తో థర్డ్‌పార్టీ యాప్స్‌ను కనెక్ట్ చేసే సమయంలో అవి అడుగుతున్న అనుమతులను పరిశీలించడం అవసరం. అవసరం లేని పర్మిషన్లను తొలగించడం, అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్‌ను తరచూ చెక్ చేయడం మంచిది.

వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్స్, లొకేషన్, ఆసక్తులు వంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే సమయంలో డేటా ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఉపయోగించవచ్చు అనే విషయాలపై జాగ్రత్తగా ఉండటం ఇప్పుడు మరింత అవసరంగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.