IPO: ప్రభుత్వ రంగ ఐపీఓ వచ్చేసింది..లాభాలు ఎలా ఉంటాయంటే..?
IPO: కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ ప్రారంభమైంది.
IPO: ప్రభుత్వ రంగ ఐపీఓ వచ్చేసింది..లాభాలు ఎలా ఉంటాయంటే..?
Mahanadi Coalfields IPO: స్టాక్ మార్కెట్లలో ఐపీఓలపై కన్నేసిన మదుపరులకు ఇది కీలక అప్‌డేట్. చాలా రోజుల తర్వాత మరో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అనుబంధ సంస్థ నుంచి మెగా ఐపీఓ తెరపైకి వచ్చింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ నవంబర్ పంతొమ్మిదిన ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ ఐపీఓ కావడంతో మార్కెట్ వర్గాల్లో దీనిపై సహజంగానే ఆసక్తి నెలకొంది.
ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే ఉండటం విశేషం. మాతృ సంస్థ కోల్ ఇండియా తన వాటాలో సుమారు పది శాతానికి సమానమైన దాదాపు అరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల షేర్లను విక్రయించనుంది.
దీని ద్వారా దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల పన్నెండు లక్షల రూపాయల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కావడంతో ఐపీఓ ద్వారా వచ్చే నిధులు కంపెనీ వ్యాపార విస్తరణకు కాకుండా, నేరుగా ప్రమోటర్ సంస్థ అయిన కోల్ ఇండియాకే చేరతాయి.
ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ గురువారం ప్రారంభం కాగా, నవంబర్ ఇరవై మూడో తేదీతో ముగియనుంది. ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్‌ను నూట ఇరవై తొమ్మిది రూపాయల నుంచి నూట ముప్పై ఆరు రూపాయల మధ్య నిర్ణయించారు. కనీస లాట్ సైజు నూట పది షేర్లుగా ఉంది. గరిష్ఠ ధర వద్ద చూస్తే కనీస పెట్టుబడి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంటుంది.
చిన్న మదుపరులు గరిష్ఠంగా పదమూడు లాట్ల వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ లెక్కన గరిష్ఠ రిటైల్ పెట్టుబడి ఒక లక్ష తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు చేరుతుంది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ విలువ సుమారు తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్ట్ కానున్నాయి. షేరు ముఖ విలువ రెండు రూపాయలుగా ఉంది. సంస్థ ఉద్యోగులకు ఇష్యూ ధరపై షేరుకు ఆరు రూపాయల చొప్పున డిస్కౌంట్ కల్పించారు. ఉద్యోగులు ప్రత్యేక కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత నవంబర్ ఇరవై ఐదున అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం నవంబర్ ఇరవై ఏడున షేర్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానున్నాయి. ఈ ఐపీఓకు కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుండగా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లీడ్ మేనేజర్‌గా ఉంది.
ఇక గ్రే మార్కెట్ పరిస్థితిని గమనిస్తే మదుపరులకు ఆశించిన స్థాయిలో లిస్టింగ్ లాభాల సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు. నవంబర్ పంతొమ్మిది నాటికి గ్రే మార్కెట్ ప్రీమియం షేరుకు కేవలం మూడు రూపాయలుగా ఉంది. ఇది సుమారు రెండు పాయింట్ రెండు ఒకటి శాతం లాభానికి సమానం. ఇదే ప్రీమియం కొనసాగి లిస్టింగ్ జరిగితే, కనీస పెట్టుబడి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలపై దాదాపు మూడు వందల ముప్పై రూపాయల మేర లాభం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే భారీ సైజుతో, ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌తో వస్తున్న ఈ ఐపీఓపై దీర్ఘకాలిక దృక్పథంతో అడుగు వేయాలా లేక లిస్టింగ్ గెయిన్స్ కోసమే చూడాలా అనేది మదుపరులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఆచితూచి నిర్ణయించుకోవాల్సిన అంశంగా మారింది.




