LPG Gas Price Hike: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Gas Price Hike: పండుగ సీజన్‌కు ముందు సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. అక్టోబర్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 నుంచి రూ.71 వరకు పెరిగింది.

CR Reddy
Published on: 1 Oct 2026 7:29 AM IST
LPG Gas Price Hike
X

LPG Gas Price Hike

LPG Gas Price Hike: పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో దేశంలోని సామాన్యులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 1 తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి కమర్షియల్‎ గ్యాస్ సిలిండర్‌‌పై రూ.60 నుంచి రూ.71 వరకు ధర పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి ఈ ధరల పెంపు పెద్ద భారంగా మారనుంది. అయితే గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రధాన నగరాల్లో మారిన కమర్షియల్‎ సిలిండర్ ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్‎ సిలిండర్ ధర రూ.62.50 పెరిగి రూ.2,810కి చేరింది. గడచిన సెప్టెంబర్ నెలలో దీని ధర రూ.2,747.50గా ఉండేది. ఇక కమర్షియల్‎ నగరమైన ముంబైలో కమర్షియల్‎ సిలిండర్ ధర రూ.63 పెరిగి రూ.2,764కు చేరుకోగా, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.941.5 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. చెన్నైలో కమర్షియల్‎ సిలిండర్ ధర రూ.2,983కి చేరగా, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.957.5గా ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగరమైన హైదరాబాద్‌లో కమర్షియల్‎ సిలిండర్ ధర దాదాపు రూ.2,996 వద్ద ఉండగా, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.994.00గా కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి పన్నుల్లో తేడాల వల్ల స్థానిక ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

ఎల్పీజీ ధరలను ఎలా నిర్ణయిస్తారు?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిబంధనల ప్రకారం ఎల్పీజీ ధరలలో హెచ్చుతగ్గులు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ఎల్‌పిజి రేట్లను ప్రామాణికంగా తీసుకుని, చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నెల సగటు ధరలు, విదేశీ మారకపు రేట్ల ఆధారంగా ఈ ధరలను సవరిస్తాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉండవు. సామాన్యులపై భారం పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సందర్భాల్లో చమురు కంపెనీలను ధరలు పెంచకుండా నియంత్రిస్తుంది. ఉదాహరణకు అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులను కాపాడేందుకు గతంలో ధరలను స్థిరంగా ఉంచిన సందర్భాలు ఉన్నాయి.

సబ్సిడీ కొనసాగింపు

గృహ వినియోగదారులకు ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను కొనసాగిస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి గరిష్టంగా 12 రీఫిల్లల కోసం ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ సబ్సిడీ ద్వారా పేద కుటుంబాలకు వంట గ్యాస్ భారం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తోంది. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉండటం సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.