లోన్ చెల్లించినా డాక్యుమెంట్లు ఇవ్వలేదా? బ్యాంకు మీకు రోజుకు రూ.5,000 ఫైన్ చెల్లించాల్సిందే
Loan Rules: హోమ్ లోన్ లేదా ఆస్తిని తాకట్టు పెట్టి తీసుకున్న ఇతర రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు నుంచి అసలు ఆస్తి పత్రాలను తప్పకుండా తీసుకోవాలి.
లోన్ చెల్లించినా డాక్యుమెంట్లు ఇవ్వలేదా? బ్యాంకు మీకు రోజుకు రూ.5,000 ఫైన్ చెల్లించాల్సిందే
Loan Rules: హోమ్ లోన్ లేదా ఆస్తిని తాకట్టు పెట్టి తీసుకున్న ఇతర రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు నుంచి అసలు ఆస్తి పత్రాలను తప్పకుండా తీసుకోవాలి. రుణం తీరిపోయిన తర్వాత కూడా బ్యాంకు పత్రాలను తన వద్దే ఉంచుకుంటే ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన నిబంధనలు రుణగ్రహీతలకు రక్షణ కల్పిస్తున్నాయని తెలుసా?
లోన్ పూర్తిగా చెల్లిస్తే 30 రోజుల్లో పత్రాలు ఇవ్వాలి
RBI నిబంధనల ప్రకారం, రుణగ్రహీత తన లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించినా లేదా రుణాన్ని సెటిల్ చేసినా.. బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థ తన వద్ద ఉన్న ఆస్తి అసలు పత్రాలను 30 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. అలాగే ఆస్తిపై బ్యాంకు నమోదు చేసిన ఛార్జ్ లేదా బంధకం వంటి వివరాలను సంబంధిత రికార్డుల నుంచి తొలగించే ప్రక్రియను కూడా పూర్తి చేయాలి.
ఈ నిబంధనలు 2023 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆస్తి పత్రాలను రుణానికి భద్రతగా తీసుకునే సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇవి వర్తిస్తాయి. అంతేకాదు, లోన్ తీసుకునే సమయంలోనే రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత అసలు పత్రాలను ఎక్కడి నుంచి తీసుకోవచ్చో బ్యాంకు స్పష్టంగా తెలియజేయాలి. పత్రాలను రుణం తీసుకున్న శాఖలోనే లేదా బ్యాంకు సూచించిన మరో కార్యాలయంలో పొందే అవకాశం కల్పించాలి.
30 రోజులు దాటితే రోజుకు రూ.5,000
రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత 30 రోజుల్లోపు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంలో బ్యాంకు ఆలస్యం చేస్తే రుణగ్రహీతకు ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యం బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థ కారణంగానే జరిగి ఉండాలి. ఉదాహరణకు.. పత్రాలను ఇవ్వడంలో 10 రోజులు అదనంగా ఆలస్యం జరిగితే, నిబంధనల ప్రకారం రూ.50,000 పరిహారం చెల్లించాల్సి రావచ్చు. పత్రాలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో కూడా బ్యాంకు రుణగ్రహీతకు తెలియజేయాలి.
ఈ నిబంధన ఉద్దేశం.. రుణం తీరిపోయిన తర్వాత కూడా బ్యాంకులు ఖాతాదారుల ఆస్తి పత్రాలను అనవసరంగా తమ వద్ద ఉంచుకోకుండా చూడటం. ముఖ్యమైన ఆస్తి పత్రాలు చేతికి అందకపోవడం వల్ల రుణగ్రహీతలకు ఎదురయ్యే సమస్యలను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.
బ్యాంకు దగ్గర పత్రాలు పోతే ఏం చేయాలి?
బ్యాంకు వద్ద భద్రపరిచిన అసలు ఆస్తి పత్రాలు పోయినా లేదా దెబ్బతిన్నా.. వాటికి సంబంధించిన డూప్లికేట్ లేదా ధృవీకరించిన కాపీలు పొందేందుకు బ్యాంకు రుణగ్రహీతకు సహాయం చేయాలి. అవసరమైన ప్రక్రియకు అయ్యే ఖర్చును కూడా బ్యాంకే భరించాలి. అయితే పత్రాలు పోయిన లేదా దెబ్బతిన్న సందర్భంలో వాటి నకళ్లను పొందేందుకు కొంత అదనపు సమయం అవసరం కావచ్చు.
ఇలాంటి పరిస్థితిలో RBI నిబంధనల ప్రకారం బ్యాంకుకు మరో 30 రోజుల సమయం లభిస్తుంది. ఆ అదనపు గడువు ముగిసిన తర్వాత కూడా అవసరమైన పత్రాలు అందించకపోతే ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 పరిహారం వర్తించే అవకాశం ఉంటుంది.
అందుకే లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత కేవలం ‘లోన్ క్లోజ్ అయింది’ అని భావించకుండా.. అసలు పత్రాలు చేతికి వచ్చాయా? ఆస్తిపై బ్యాంకు ఛార్జ్ తొలగించారా? అనే విషయాలను కూడా నిర్ధారించుకోవాలి.
పత్రాలు రాకపోతే ముందుగా ఏం చేయాలి?
లోన్ పూర్తిగా చెల్లించినా 30 రోజుల్లోపు ఆస్తి పత్రాలు తిరిగి రాకపోతే ముందుగా బ్యాంకుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అందులో లోన్ ఖాతా పూర్తిగా మూసివేసిన తేదీ, ఆస్తి పత్రాల వివరాలు, వాటిని తిరిగి ఇవ్వాలని కోరుతున్న విషయం స్పష్టంగా పేర్కొనాలి. అలాగే లోన్ క్లోజ్ అయినట్లు రాతపూర్వక ఆధారం, పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందనే వివరాలను బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. ఫిర్యాదు కాపీ, ఈమెయిల్స్, లేఖలు, బ్యాంకు సమాధానాలు వంటి అన్ని రికార్డులను భద్రపరచుకోవాలి. బ్యాంకు అంతర్గత ఫిర్యాదు పరిష్కార విధానం ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, RBI ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఆశ్రయించవచ్చు.




