LIC: ఎల్ఐసీ బిగ్ అనౌన్స్‌మెంట్ ...మార్కెట్లోకి 3 సరికొత్త స్కీమ్‌లు

LIC: ఎల్ఐసీ 3 కొత్త నాన్-లింక్డ్ బీమా పథకాలను ప్రకటించింది.

Gagan kumar
Published on: 14 Oct 2026 11:47 AM IST
LIC
X

LIC: ఎల్ఐసీ బిగ్ అనౌన్స్‌మెంట్ ...మార్కెట్లోకి 3 సరికొత్త స్కీమ్‌లు

LIC New Schemes 2026: భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు చెప్పింది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 3 కొత్త బీమా పథకాలను ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత క్రమమైన ఆదాయం, ఆస్పత్రి ఖర్చుల భారం తగ్గించే హెల్త్ కవర్, అలాగే ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక భరోసా అందించే లక్ష్యంతో ఈ ప్లాన్లను రూపొందించింది.

ఈ మేరకు ఎల్ఐసీ అక్టోబర్ 13న బిఎస్ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించింది. ఈ మూడూ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ కేటగిరీకి చెందిన ప్లాన్లు. అంటే ఇవి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ మూడు ఆకర్షణీయమైన ప్లాన్లు 2026, అక్టోబర్ 19 నుంచి దేశవ్యాప్తంగా కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

ఎల్ఐసీ న్యూ జీవన్ ధారా- II

భవిష్యత్తులో ఉద్యోగం లేకపోయినా ప్రతినెల కచ్చితమైన పింఛన్ లేదా ఆదాయం కోరుకునే వారికి ఇది సరైన ప్లాన్. పాలసీదారుడు నిర్ణీత కాలపరిమితి వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఎంచుకున్న పద్ధతిలో క్రమం తప్పకుండా పింఛన్ రూపంలో డబ్బులు పొందవచ్చు. రెగ్యులర్ లేదా సింగిల్ ప్రీమియం చెల్లించే వెసులుబాటు.

ఒకరి పేరు మీద లేదా దంపతులిద్దరి పేరు మీద ప్లాన్ తీసుకునే అవకాశం. పాలసీ ప్రారంభంలోనే ఫిక్స్ అయిన గ్యారెంటీడ్ రేట్ల ప్రకారం చెల్లింపులు. అదనపు సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు టాప్-అప్ యాన్యుటీ సదుపాయం. కనీసం 18 ఏళ్లు నిండిన వారు ఇందులో చేరవచ్చు.

ఎల్ఐసీ హెల్త్ షీల్డ్

ఆకస్మిక అనారోగ్యాలు, సర్జరీల వల్ల వచ్చే ఆర్థిక కష్టాల నుంచి ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు రోజువారీ నగదు ప్రయోజనం. పెద్ద శస్త్రచికిత్సలు, తీవ్రమైన అనారోగ్యాలు ఎదురైనప్పుడు ఖర్చు మొత్తాన్ని ఒకేసారి చెల్లించే సదుపాయం. అదనపు రక్షణ కోసం ఆప్షనల్ రైడర్లు. 18 నుంచి 65 ఏళ్ల వయస్సు గలవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పిల్లలకు 90 రోజుల నుంచి 20 ఏళ్ల వరకు కవరేజీ లభిస్తుంది. పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు.

ఎల్ఐసీ న్యూ క్యాన్సర్ కవర్

క్యాన్సర్ మహమ్మారి బారిన పడినప్పుడు అయ్యే భారీ ఖర్చుల నుంచి కుటుంబాన్ని కాపాడేందుకు ఈ ప్రత్యేక ప్లాన్ ఉపయోగపడుతుంది. వ్యాధి ప్రారంభ దశలోనే నిర్ధారణ అయితే బీమా మొత్తంలో 25 శాతం చెల్లిస్తారు. తీవ్రమైన దశ క్యాన్సర్ అని తేలితే బీమా మొత్తంలో 100 శాతం ఒకేసారి అందిస్తారు. మేజర్ స్టేజ్ క్యాన్సర్‌కు అర్హత పొందితే.. బీమా మొత్తంలో 1 శాతం చొప్పున పదేళ్ల పాటు ప్రతి నెలా ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు కవరేజీ లభించే అవకాశం ఉంది.

పాలసీలు ఎలా తీసుకోవాలి?

అక్టోబర్ 19న అధికారికంగా లాంచ్ అయిన తర్వాత ఎల్ఐసీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో లేదా ఎల్ఐసీ ఏజెంట్లు, అధీకృత మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు. ఏ బీమా పాలసీ తీసుకునే ముందైనా ప్రవేశ వయస్సు, ప్రీమియం వివరాలు, వెయిటింగ్ పీరియడ్ , ముందస్తు వ్యాధుల నిబంధనలు క్లెయిమ్ మినహాయింపులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.