Jio IPO: రూ.3.73 లక్షల కోట్ల బిడ్లతో చరిత్ర సృష్టించిన జియో ఐపీఓ.. షేర్ల కేటాయింపు ఎప్పుడంటే?
Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు మదుపర్ల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది.
Jio IPO
Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు మదుపర్ల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. కంపెనీ విడుదల చేసిన పబ్లిక్ ఇష్యూకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి భారీ ఎత్తున బిడ్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో రూ.8,110 కోట్ల విలువైన షేర్ల కోసం రూ.2.5 లక్షల కోట్లకు పైగా బిడ్లు రావడం దీని అద్భుతమైన క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. మార్కెట్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ పబ్లిక్ ఇష్యూ దూసుకుపోతోంది.
గురువారం ముగిసే సమయానికి ఈ ఐపీఓ కింద ఏకంగా 110 కోట్ల షేర్ల కోసం రూ.1.23 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే రూ.3.73 లక్షల కోట్ల బిడ్లు దాఖలు కాగా, 5.57 రెట్ల భారీ స్పందన నమోదైంది. క్యూఐబీ విభాగంలో రూ.72,898 కోట్ల విలువైన బిడ్లతో 13.29 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ విభాగం రూ.24,330 కోట్ల బిడ్లతో 5.97 రెట్లు దూసుకెళ్లింది. రిటెయిల్ మదుపర్లు సైతం వెనకడుగు వేయకుండా రూ.14,652 కోట్ల విలువైన బిడ్లు సమర్పించారు.
సాధారణ ఇన్వెస్టర్లతో పాటు రిలయన్స్ సంస్థ ఉద్యోగులు అలాగే ప్రస్తుత వాటాదారులు కూడా ఈ ఐపీఓలో విపరీతంగా పాల్గొంటున్నారు. ఉద్యోగుల కోసం రూ.500 కోట్ల విలువైన షేర్లు కేటాయించగా, ఏకంగా రూ.1103 కోట్ల బిడ్లు దక్కాయి. ఇది 2.10 రెట్ల స్పందనను సాధించింది. రిలయన్స్ ప్రస్తుత వాటాదారుల విభాగంలో రూ.2500 కోట్ల షేర్ల కోటా ఉండగా, రూ.10,107 కోట్ల బిడ్లు వచ్చి పడ్డాయి. దీని ద్వారా వాటాదారుల నుంచి 4.04 రెట్ల స్పందన కనిపించింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ ఐపీఓ శుక్రవారంతో ముగియనుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తికాగానే మదుపర్లకు షేర్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 26వ తేదీన జరగనుంది. ఆ తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈ షేర్లు ఈనెల 28వ తేదీన అధికారికంగా నమోదు కానున్నాయి. జియో షేర్లు మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలు అందిస్తాయనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.




