Policybazaar: పాలసీ బజార్‌లో డబ్బులు పెట్టారా..? అయితే మీ డబ్బులు గోవిందా..!
Policybazaar: బీమా రంగంలో ఐఆర్‌డీఏఐ తెచ్చిన కొత్త నిబంధనలు, సంస్కరణల ప్రతిపాదనల కారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్సూరెన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
Policybazaar: పాలసీ బజార్‌లో డబ్బులు పెట్టారా..? అయితే మీ డబ్బులు గోవిందా..!
Policybazaar: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ 19 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు మార్కెట్లను కుదిపేసిన వేళ.. అటు ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి వెలువడిన ఒక సంచలన వార్త మదుపర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు, నిబంధనల ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఆధారిత స్టాక్స్ అన్నీ భారీ నష్టాలను చవిచూడగా, ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పాలసీబజార్ షేర్లు కుప్పకూలాయి.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణం.. బీమా రంగంలో ఐఆర్‌డీఏఐ ప్రతిపాదిస్తున్న కఠినమైన సంస్కరణలే. ముఖ్యంగా కమీషన్లు, పంపిణీ ఖర్చులకు సంబంధించి తెస్తున్న కొత్త రూల్స్ బీమా కంపెనీల వ్యాపార నమూనాను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా, బీమా సంస్థల వెబ్‌సైట్లలో కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ఉండే డార్క్ ప్యాటర్న్స్ పై నిషేధం విధించాలని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంపై ఆధారపడిన కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
ఈ ప్రతిపాదనల ప్రభావం అత్యధికంగా పాలసీబజార్ షేర్లపై పడింది. క్రితం రోజు రూ. 1,886.30 వద్ద ముగిసిన ఈ షేరు.. గురువారం ఉదయం నేరుగా 10 శాతం నష్టంతో రూ. 1,697.70 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా మరింత పతనమై, ఇంట్రాడేలో ఏకంగా 26.01 శాతం నష్టంతో రూ. 1,395.70 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక్కో షేరుపై ఏకంగా రూ. 490 పైగా కోల్పోవడం, ఒకే రోజులో ఈ స్థాయిలో స్టాక్ పడిపోవడం ఇన్వెస్టర్లకు భారీ షాక్ ఇచ్చింది.
ఇతర ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ షేర్ల పరిస్థితి ఇదే..
టర్టిల్‌మింట్: ఈ ఫిన్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 20 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ. 109.04 వద్ద స్థిరపడ్డాయి.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్: ఈ ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఇంట్రాడేలో దాదాపు 9 శాతం వరకు పడిపోయి, ఆ తర్వాత కొంత కోలుకుని 4 నుంచి 5 శాతం నష్టాల్లో ముగిశాయి.
బజాజ్ గ్రూప్ & యాక్సిస్ బ్యాంక్: ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్న బజాజ్ ఫినాన్స్ 5 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4 శాతానికి పైగా నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ కూడా ప్రారంభంలో ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మార్కెట్ పతనాన్ని తట్టుకుని లాభాల్లో ట్రేడ్ కావడం విశేషం. మొత్తానికి, ఐఆర్‌డీఏఐ తెచ్చిన ఈ కొత్త నిబంధనలు స్వల్పకాలికంగా ఇన్సూరెన్స్, ఫిన్‌టెక్ రంగాల షేర్లకు పెద్ద పరీక్షగా మారాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




