IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. 11 రోజుల టూర్ ప్యాకేజీ!

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ 11 రోజుల సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రకటించింది. రూ.18 వేల నుంచి టికెట్లు, కొత్త ప్యాకేజీ ధరలు, పూర్తి వివరాలు ఇవే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 2:34 AM IST
IRCTC Tour: 7 Jyotirlingas in 11 Days From Rs 18000
X

IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. 11 రోజుల టూర్ ప్యాకేజీ!

IRCTC Tour: కార్తీక మాసంలో పరమశివుడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త అందించింది. దేశంలోని ఏడు ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించుకునేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర' పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ పర్యటనను నిర్వహించనుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ యాత్ర నవంబర్ 17 నుంచి నవంబర్ 27, 2026 వరకు కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.18,000 నుంచి అందుబాటులో ఉంది.

ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య రైల్వే జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ విభాగాల్లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక రవాణా, ఆలయ దర్శనాలు, భోజన సదుపాయాలను కూడా ప్యాకేజీలో భాగంగా కల్పిస్తున్నట్లు వివరించారు.

ఈ 7 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు

ఈ 11 రోజుల యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

  1. మహాకాళేశ్వర్: ఉజ్జయిని, మధ్యప్రదేశ్.

  2. ఓంకారేశ్వర్: మధ్యప్రదేశ్.

  3. నాగేశ్వర్: ద్వారక, గుజరాత్.

  4. సోమనాథ్: గుజరాత్.

  5. భీమశంకర్: పుణె, మహారాష్ట్ర.

  6. త్రయంబకేశ్వర్: నాసిక్, మహారాష్ట్ర.

  7. ఘృష్ణేశ్వర్: ఛత్రపతి సంభాజీనగర్, మహారాష్ట్ర.

ఈ ఏడు పవిత్ర క్షేత్రాలను ఒకే పర్యటనలో దర్శించుకునేలా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక షెడ్యూల్ రూపొందించింది.

నవంబర్ 17న సికింద్రాబాద్ నుంచి యాత్ర ప్రారంభం

నవంబర్ 17, 2026న ఉదయం 8 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తెలంగాణ, సమీప ప్రాంతాల ప్రయాణికుల కోసం మొత్తం ఏడు రైల్వే స్టేషన్లలో ఎక్కే అవకాశం కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్‌ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్‌లలో ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు.

రెండో రోజు ఉదయం 8 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస ఏర్పాటు చేసి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం కల్పిస్తారు. మహాకాళేశ్వర్ కారిడార్‌ను కూడా సందర్శిస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం తర్వాత ఓంకారేశ్వర్ ఆలయానికి రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. ఉజ్జయిని నుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ దర్శనం అనంతరం డాక్టర్ అంబేడ్కర్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ద్వారకకు ప్రయాణం ప్రారంభమవుతుంది.

నాలుగో రోజు మధ్యాహ్నం 3 గంటలకు ద్వారక చేరుకుంటారు. ఐదో రోజు ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శిస్తారు. అనంతరం ఓఖా రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్‌కు రైలు ప్రయాణం ఉంటుంది.

ఆరో రోజు ఉదయం సోమనాథ్ లేదా వెరావల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత హోటల్‌లో స్నానం, దుస్తులు మార్చుకునే సదుపాయం కల్పిస్తారు. అనంతరం సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పుణెలోని ఖడ్కీకి రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఏడో రోజు ఉదయం 11 గంటలకు ఖడ్కీ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస చేసిన తర్వాత ఎనిమిదో రోజు తెల్లవారుజామున భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరుతారు. పుణె నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమశంకర్ ఆలయ దర్శనం అనంతరం ఓజర్‌లోని ప్రసిద్ధ శ్రీ విఘ్నహర్ గణపతి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఇది అష్టవినాయక ఆలయాల్లో ఒకటి. ఆ తర్వాత నాసిక్‌కు రైలు ప్రయాణం ఉంటుంది.

తొమ్మిదో రోజు ఉదయం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం ఛత్రపతి సంభాజీనగర్‌కు బయలుదేరుతారు. పదో రోజు ఉదయం అక్కడికి చేరుకున్న తర్వాత ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

పదకొండో రోజు పూర్ణ, నాందేడ్, ముద్‌ఖేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలో ప్రయాణికులు దిగవచ్చు. చివరగా మధ్యాహ్నం 12 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

IRCTC టూర్ ప్యాకేజీ ధరలు ఇవే

ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా ఐఆర్‌సీటీసీ మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. పెద్దలు, పిల్లలకు వేర్వేరు ధరలు నిర్ణయించింది.

ప్యాకేజీ

ప్రయాణ సదుపాయం

పెద్దలకు

పిల్లలకు

ఎకానమీ

స్లీపర్ క్లాస్

₹18,000

₹16,700

స్టాండర్డ్

3ఏసీ

₹27,400

₹25,900

కంఫర్ట్

2ఏసీ

₹35,500

₹33,600

5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు పేర్కొన్న ధరలు వర్తిస్తాయి. ధరల్లో జీఎస్టీ కలిపి ఉంటుంది.

భారత్ గౌరవ్ రైలు పథకం కింద రైల్వే టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేలు సుమారు 33 శాతం రాయితీ అందిస్తున్నాయి. ఈ రాయితీని ఇప్పటికే ప్యాకేజీ ధరల్లో కలిపినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

ప్యాకేజీలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి?

ఈ యాత్రలో ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పిస్తారు.

  • ఎంపిక చేసుకున్న కేటగిరీ ప్రకారం రైలు ప్రయాణం.

  • బడ్జెట్ హోటళ్లలో రాత్రి బస.

  • స్నానం, దుస్తులు మార్చుకునే సదుపాయం.

  • ఏడు జ్యోతిర్లింగాల ఆలయ దర్శనాలు.

  • స్థానిక ప్రాంతాల సందర్శనకు రవాణా.

  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం.

  • ప్రయాణ బీమా సదుపాయం.

  • అనుభవజ్ఞులైన టూర్ ఎస్కార్ట్స్, టూర్ మేనేజర్ల సహాయం.

  • రైలులో భద్రతా ఏర్పాట్లు.

అయితే భోజనాలన్నీ పూర్తిగా శాకాహారమే. ముందుగా నిర్ణయించిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తారు. ప్రయాణికులు తమకు నచ్చిన వంటకాలను ప్రత్యేకంగా ఎంచుకునే అవకాశం ఉండదు.

ప్యాకేజీలో లేని అదనపు ఖర్చులు ఇవే

టూర్ ప్యాకేజీ ధరలో అన్ని రకాల ఖర్చులు ఉండవు. స్మారక కట్టడాల ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్థానిక గైడ్ ఛార్జీలు వంటి వాటికి ప్రయాణికులే అదనంగా చెల్లించాలి. అలాగే రూమ్ సర్వీస్, డ్రైవర్లు, వెయిటర్లు, గైడ్లకు ఇచ్చే టిప్స్, లాండ్రీ, మినరల్ వాటర్, అదనపు ఆహారం, పానీయాల ఖర్చులు కూడా ప్యాకేజీలో ఉండవు.

బుకింగ్, పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు.

  • సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701

  • విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675

  • తిరుపతి: 9281030785, 9281030773, 9281030772

  • విశాఖపట్నం: 9281495837, 9281495847

అలాగే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్