IPO: రూ.3.86 లక్షల కోట్లకు చేరిన ఐపీఓ పైప్‌లైన్.. భారీగా పెరుగుతున్న కంపెనీల ఆసక్తి
India IPO Pipeline: భారత ఐపీఓ మార్కెట్‌లో అపూర్వ వృద్ధి. రూ. 3.86 లక్షల కోట్లకు చేరిన ఐపీఓ పైప్‌లైన్ వివరాలు వెల్లడించిన ఏఐబీఐ.
IPO: రూ.3.86 లక్షల కోట్లకు చేరిన ఐపీఓ పైప్‌లైన్.. భారీగా పెరుగుతున్న కంపెనీల ఆసక్తి
India IPO Pipeline: భారతీయ మూలధన మార్కెట్ ఆల్-టైమ్ గరిష్టాల వైపు దూసుకెళ్తోంది. దేశీయ ప్రాథమిక మార్కెట్ (Primary Market) మునుపెన్నడూ లేని విధంగా అపూర్వమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రస్తుతం మెయిన్‌బోర్డ్ ఐపీఓ (IPO) పైప్‌లైన్ విలువ ఏకంగా రూ. 3.86 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 84 ఇష్యూల ద్వారా కంపెనీలు సేకరించిన రూ. 1.10 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు 3.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. నిధుల సేకరణ కోసం విదేశీ మార్కెట్లపై ఆధారపడకుండా భారత పబ్లిక్ మార్కెట్లను వినియోగించుకోవడానికి స్వదేశీ, విదేశీ కంపెనీలు అమితమైన ఆసక్తి చూపుతున్నాయని 'అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా' (AIBI) వెల్లడించింది.
ఏఐబీఐ విడుదల చేసిన మధ్యకాలిక శ్వేతపత్రం వివరాల ప్రకారం.. ఈ భారీ పైప్‌లైన్‌లో మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) నుంచి ఇప్పటికే అనుమతి పొందిన దాదాపు 130 కంపెనీలు ఉన్నాయి. వీటికి తోడు మరో 75 కంపెనీలు తమ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) పత్రాలను సమర్పించి, సెబీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. సెబీ అనుమతి లభించిన కంపెనీల ఐపీఓల విలువ రూ. 2.43 లక్షల కోట్లు కాగా, పరిశీలనలో ఉన్న సంస్థల వాటా మరో రూ. 1.44 లక్షల కోట్లుగా ఉందని ఏఐబీఐ ఛైర్మన్ మహావీర్ లునావత్ పేర్కొన్నారు.
'ఇండియా క్యాపిటల్ మార్కెట్స్: నావిగేటింగ్ జియోపాలిటిక్స్, క్యాపిటల్ & గ్రోత్' పేరిట వెలువడిన ఈ నివేదిక, భారత ప్రాథమిక మార్కెట్ కేవలం తాత్కాలిక పురోగతికే పరిమితం కాకుండా మరింత లోతైన, నిలకడైన మరియు పరిపక్వమైన మూలధన వ్యవస్థగా ఆవిర్భవించిందని స్పష్టం చేసింది. 2016 నుండి 2026 మధ్య దశాబ్ద కాలంలో ఐపీఓల ద్వారా మొత్తం రూ. 8.36 లక్షల కోట్లు సమీకరించబడగా, 2016లో కేవలం రూ. 26,494 కోట్లుగా ఉన్న వార్షిక నిధుల సేకరణ 2025 నాటికి ఏకంగా రూ. 1.76 లక్షల కోట్లకు చేరి సరికొత్త మైలురాయిని తాకింది.




