Ethanol Demand: ఇథనాల్ డిమాండ్ భారీగా పెరుగుతుందా? FY31కి 17.9 బిలియన్ లీటర్లు
Ethanol Demand: భారత్‌లో ఇథనాల్ డిమాండ్ FY31 నాటికి 17.9 బిలియన్ లీటర్లకు చేరొచ్చని అంచనా. E20, E30 బ్లెండింగ్‌తో డిమాండ్‌పై ప్రభావం ఇదే.
Ethanol Demand: ఇథనాల్ డిమాండ్ భారీగా పెరుగుతుందా? FY31కి 17.9 బిలియన్ లీటర్లు
Ethanol Demand: దేశంలో ఇథనాల్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. 2030-31 నాటికి ఇథనాల్ డిమాండ్ 17.9 బిలియన్ లీటర్లకు చేరొచ్చని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తాజా నివేదిక అంచనా వేసింది.
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తికి 18.25 బిలియన్ లీటర్ల స్థాపిత డిస్టిలరీ సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యం FY31 నాటికి వచ్చే ప్రాథమిక డిమాండ్‌ను దాదాపుగా అందుకోగలదని నివేదిక చెబుతోంది. అయితే అప్పటికి ఉన్న సామర్థ్యంలో దాదాపు 98 శాతం వినియోగం జరిగే అవకాశం ఉంది.
అంటే కొత్త సామర్థ్యాన్ని వెంటనే భారీగా పెంచడం కంటే.. ముందుగా ఉన్న డిస్టిలరీలను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
E20 వద్దే ఆగితే?
ఇథనాల్ బ్లెండింగ్ E20 స్థాయిలోనే కొనసాగితే, FY31 నాటికి డిమాండ్ సుమారు 14.3 బిలియన్ లీటర్లుగా ఉండొచ్చని బేర్ కేస్ అంచనా చెబుతోంది.
ఈ పరిస్థితిలో ప్రస్తుత 18.25 బిలియన్ లీటర్ల సామర్థ్యంలో దాదాపు 78 శాతం మాత్రమే వినియోగం అవుతుంది. కానీ బ్లెండింగ్ E25కి పెరిగితే డిమాండ్ మరింత పెరిగి 17.9 బిలియన్ లీటర్లకు చేరే అవకాశం ఉంది.
E30కి వెళ్తే మాత్రం లెక్క మారుతుంది
ఇథనాల్ బ్లెండింగ్‌ను E30కి పెంచితే మాత్రం ప్రస్తుత సామర్థ్యం సరిపోకపోవచ్చు. బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సానుకూల అంచనా ప్రకారం.. FY31 నాటికి డిమాండ్ 21.5 బిలియన్ లీటర్లకు చేరొచ్చు.
ఇది ప్రస్తుతం దేశంలో ఉన్న 18.25 బిలియన్ లీటర్ల సామర్థ్యం కంటే సుమారు 18 శాతం ఎక్కువ. అంటే E30 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొత్త డిస్టిలరీ సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
అందుకే రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో పెట్టుబడులు ఎంత పెరుగుతాయన్నది.. ప్రభుత్వం బ్లెండింగ్ విధానాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తుందనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని రేటింగ్స్ ఏజెన్సీ చెబుతోంది.
చక్కెర కంటే ధాన్యాల వైపు మొగ్గు
ఇదే సమయంలో ఇథనాల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ESY26 సైకిల్ 1 కేటాయింపుల్లో ధాన్యం ఆధారిత ఇథనాల్‌కు 72 శాతం వాటా ఉండగా.. చక్కెర ఆధారిత మార్గాలకు 28 శాతం వాటా ఉంది.
2021లో రూపొందించిన రోడ్‌మ్యాప్‌లో అంచనా వేసిన 55:45 చక్కెర-ధాన్యం నిష్పత్తితో పోలిస్తే ఇది గణనీయమైన మార్పు.
ఇందులో ముఖ్యంగా మొక్కజొన్న వాటా 45.7 శాతంగా ఉంది. అయితే ధాన్యం ఆధారిత డిస్టిలరీలకు పెరుగుతున్న ఫీడ్‌స్టాక్ ఖర్చులు మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ విభాగంలో EBITDA మార్జిన్ FY21లో 9.2 శాతం ఉండగా.. FY25 నాటికి 6.7 శాతానికి తగ్గింది.
ఇకపై సామర్థ్య వినియోగంపైనే ఫోకస్
E20 లక్ష్యం చాలావరకు సాధించబడటం, ఇప్పటికే దేశంలో భారీ స్థాయిలో డిస్టిలరీ సామర్థ్యం అందుబాటులో ఉండటంతో.. ఇథనాల్ పరిశ్రమలో తదుపరి దశ కొంత భిన్నంగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది.
ఇకపై కంపెనీలు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం కంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, ముడి పదార్థాల ఖర్చులను నియంత్రించడం, ఇప్పటికే ఉన్న ఆస్తుల నుంచి మరింత ఆదాయం పొందడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
అయితే E30 దిశగా బ్లెండింగ్ పెరిగితే మాత్రం కొత్త డిస్టిలేషన్ సామర్థ్యానికి డిమాండ్ తప్పనిసరిగా పెరుగుతుంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోళ్లు, ధరల నిర్ణయం, E20 బ్లెండింగ్ లక్ష్య సాధనతో పాటు.. అక్టోబర్ 2025 నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇథనాల్ రంగానికి రూ.42,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం కూడా పరిశ్రమకు మద్దతుగా నిలుస్తోందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తెలిపింది.
ఈ కారణాలతో ఇథనాల్ రంగంపై స్థిరమైన క్రెడిట్ ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.




