ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. నవంబర్ 25 నుంచి ఛార్జీల పెంపు, ఉచిత బీమా, సినిమా ఆఫర్ల రద్దు వివరాలు తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2026 2:00 AM IST
ICICI Credit Card
X

ICICI Credit Card

ICICI Credit Card : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక అలర్ట్. బ్యాంక్ తన క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు ఛార్జీలను పెంచడంతో పాటు, ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని ప్రయోజనాలను నిలిపివేయనుంది. ఈ కొత్త మార్పులు 2026 నవంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రయోజనాల తొలగింపు మాత్రం డిసెంబర్ 15 వరకు దశలవారీగా కొనసాగనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు చేసే వారు, బిజినెస్, కార్పొరేట్, ప్రీమియం క్రెడిట్ కార్డులు వినియోగించే వారు ఈ మార్పులను గమనించాలి. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీల పెంపు, కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజుల పెంపుతో పాటు ఉచిత బీమా, సినిమా ప్రయోజనాలను కూడా బ్యాంక్ తొలగిస్తోంది.

నవంబర్ 25 నుంచి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల్లో 6 కీలక మార్పులు

ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త మార్పులు కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు భారీగా పెంపు

విదేశాల్లో క్రెడిట్ కార్డుతో లావాదేవీలు నిర్వహించే వారికి ఇది ముఖ్యమైన మార్పు. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీలను ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 3.50 శాతానికి బ్యాంక్ పెంచుతోంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 25, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.

విదేశాల్లో భారతీయ రూపాయల్లో చెల్లింపులు చేసినప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే భారత్‌లోని వ్యాపార సంస్థ విదేశాల్లో రిజిస్టర్ అయి ఉన్న సందర్భాల్లో భారతీయ రూపాయల్లో చేసే కొన్ని లావాదేవీలపైనా ఈ ఛార్జీలు పడవచ్చు.

బిజినెస్ బ్లాక్ అడ్వాంటేజ్, బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్, ట్రావెల్ ఏజెంట్ కార్డ్, బిజినెస్ ప్లాటినం తదితర కొన్ని కార్డులకు ఈ మార్పులు వర్తిస్తాయి.

2. బిజినెస్, కార్పొరేట్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఫీజు పెంపు

క్రెడిట్ కార్డు పోయినా, పాడైనా కొత్త కార్డు తీసుకోవాలంటే ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన బిజినెస్, కార్పొరేట్, పర్చేజ్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఛార్జీని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. ఈ ఛార్జీకి అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలి. నవంబర్ 25 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

3. కొన్ని క్రెడిట్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఛార్జీలు పెంపు

ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఫీజును కూడా బ్యాంక్ పెంచింది. ఇప్పటివరకు రూ.200గా ఉన్న ఈ ఛార్జీ ఇకపై రూ.300కు చేరుతుంది. అంటే ఏకంగా 50 శాతం పెరుగుదల అన్నమాట. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, టైమ్స్ బ్లాక్ కార్డులకు ఈ పెంపు వర్తించదు.

4. ప్రియారిటీ పాస్ రీప్లేస్‌మెంట్‌కూ ఛార్జీలు

విమానాశ్రయాల్లో లాంజ్ సదుపాయాలు పొందేందుకు ఉపయోగించే ప్రియారిటీ పాస్ కార్డుల విషయంలోనూ బ్యాంక్ మార్పులు చేసింది. ఇప్పటివరకు అర్హత కలిగిన వినియోగదారులు రీప్లేస్‌మెంట్ కార్డును ఉచితంగా పొందే అవకాశం ఉండేది. అయితే డిసెంబర్ 11, 2026 నుంచి కొత్త ప్రియారిటీ పాస్ కార్డు తీసుకోవాలంటే రూ.300తో పాటు జీఎస్టీ చెల్లించాలి.

ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, ఎమరాల్డ్ ప్రైవేట్, ఎమరాల్డ్, సఫైరో, టైమ్స్ బ్లాక్, కొన్ని మేక్‌మైట్రిప్, ఎమిరేట్స్ స్కైవార్డ్స్ కార్డులకు ఈ మార్పులు వర్తిస్తాయి.

5. ఉచిత బీమా ప్రయోజనాలకు స్వస్తి

క్రెడిట్ కార్డులతో లభించే ఉచిత బీమా ప్రయోజనాలను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ నిలిపివేస్తోంది. డిసెంబర్ 15, 2026 నుంచి ఎంపిక చేసిన కార్డులపై ఉచిత ట్రావెల్ యాక్సిడెంట్, సంబంధిత బీమా ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.

ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్ ప్రైవేట్, ఎమరాల్డ్, డైమాంట్, సఫైరో, రూబిక్స్ కార్డులపై ఈ మార్పు ప్రభావం చూపనుంది.

అంతేకాకుండా ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ కార్డులపై క్యాన్సిలేషన్ ఫర్ ఎనీ రీజన్ (CFAR) బీమా ప్రయోజనాన్ని కూడా తొలగించనుంది. పరాక్రమ్, పరాక్రమ్ సెలెక్ట్ కార్డులపై ఉచిత వ్యక్తిగత ప్రమాద, ప్రయాణ ప్రమాద బీమా సదుపాయాలు కూడా నిలిచిపోనున్నాయి.

6. ఉచిత ఐనాక్స్ సినిమా ఆఫర్ నిలిపివేత

క్రెడిట్ కార్డులపై ఉచితంగా లభించే సినిమా ప్రయోజనాలకు కూడా బ్యాంక్ స్వస్తి పలుకుతోంది. డిసెంబర్ 15, 2026 నుంచి ఎంపిక చేసిన కార్డులపై ఉచిత ఐనాక్స్ మూవీ బెనిఫిట్ అందుబాటులో ఉండదు.

రూబిక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్, చెన్నై సూపర్ కింగ్స్, మేక్‌మైట్రిప్ ప్లాటినం, మేక్‌మైట్రిప్ సిగ్నేచర్, మేక్‌మైట్రిప్, హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్, ఎమిరేట్స్ రూబిక్స్ కార్డులకు ఈ మార్పు వర్తించనుంది. ఇప్పటివరకు ఈ కార్డుల ద్వారా ఉచిత సినిమా ప్రయోజనాలు పొందుతున్న వారు ఇకపై ప్రత్యామ్నాయ ఆఫర్లను పరిశీలించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు వినియోగదారులు ఏం చేయాలి?

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ వద్ద ఉన్న కార్డు రకం, దానికి వర్తించే కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా విదేశాల్లో తరచూ లావాదేవీలు చేసేవారు పెరిగిన డీసీసీ ఛార్జీలను గమనించాలి. ఉచిత బీమా ప్రయోజనాలపై ఆధారపడేవారు ప్రత్యామ్నాయ బీమా తీసుకోవాల్సిన అవసరం ఉందేమో పరిశీలించాలి.

అలాగే కొత్త కార్డు లేదా ప్రియారిటీ పాస్ రీప్లేస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసే ముందు వర్తించే ఛార్జీలను తెలుసుకోవాలి. ఈ మార్పులు అన్ని క్రెడిట్ కార్డులకు వర్తించవు కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డుకు సంబంధించిన తాజా నిబంధనలను పరిశీలించడం మంచిది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్