Coca-Cola: దలాల్ స్ట్రీట్‌లోకి కోకా-కోలా.. రూ. 9,000 కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
Coca-Cola: హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్స్ రూ. 8,500-9,000 కోట్ల ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ దాఖలు చేసింది.
Coca-Cola: దలాల్ స్ట్రీట్‌లోకి కోకా-కోలా.. రూ. 9,000 కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
Hindustan Coca-Cola: భారతీయ స్టాక్ మార్కెట్ వర్గాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. దేశీయ కూల్ డ్రింక్స్ రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని చాటుతున్న కోకా-కోలా బాట్లింగ్ భాగస్వామి హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్స్ త్వరలోనే దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ. 8,500 కోట్ల నుంచి రూ. 9,000 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమోటర్ సంస్థ అయిన హిందుస్థాన్ కోకా-కోలా ఓవర్సీస్ హోల్డింగ్స్ ద్వారా ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10 కలిగిన దాదాపు 99.74 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వస్తుండటంతో, ఐపీఓ నిధులు నేరుగా వాటాలు విక్రయించే ప్రమోటర్లకే వెళ్తాయి. ప్రస్తుతం ఈ సంస్థలో అంతర్జాతీయ దిగ్గజం కోకా-కోలా కంపెనీకి 60 శాతం వాటా, జూబిలెంట్ బెవరేజెస్‌కు 40 శాతం వాటా ఉంది. ఐపీఓ ప్రక్రియ పూర్తయిన తర్వాత కోకా-కోలా వాటా 45 శాతానికి తగ్గనుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోకా-కోలా ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉన్న దేశాల్లో భారత్ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. వేగంగా పెరుగుతున్న వినియోగం, యువ జనాభా ఆదరణతో రాబోయే రోజుల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మౌలిక వృద్ధి అంచనాల మధ్య దలాల్ స్ట్రీట్‌లో లిస్టింగ్ అవుతుండటంతో, భారత ఇన్వెస్టర్లు ఈ భారీ ఐపీఓ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




