Diwali gift: ఉద్యోగులకు కియా సోనెట్ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ..!
Diwali gift: దీపావళి కానుకగా ఉద్యోగులకు సరికొత్త కియా సోనెట్ ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇచ్చింది హర్యానాకు చెందిన MITS హెల్త్‌కేర్. డౌన్‌పేమెంట్ కంపెనీయే చెల్లించి, ఉద్యోగుల పేర్లపైనే కార్లను రిజిస్టర్ చేసింది.
Diwali gift: ఉద్యోగులకు కియా సోనెట్ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ..!
MITS Healthcare: దీపావళి పండంటేనే ఆనందాలు, మిఠాయిలు, కొత్త బట్టలు... కానీ, ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి కానుక చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా పండుగ బోనస్‌లు లేదా చిన్న బహుమతులతో సరిపెట్టే రోజుల్లో, ఏకంగా కొత్త కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచింది హర్యానాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ 'MITS హెల్త్‌కేర్'. ఉద్యోగుల కష్టాన్ని, పనితీరును గుర్తించి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెన్సేషన్‌గా మారింది.
కార్ల షోరూమ్‌లో నాలుగు సరికొత్త కియా సోనెట్ SUV కార్లను నల్లటి వస్త్రాలతో కప్పి ఉంచగా... ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఆ వస్త్రాలను తొలగించి తమ కలల కారును కళ్లారా చూసుకున్నారు. ఆ క్షణంలో వారి మొహాల్లో వెలిగిన చిరునవ్వులు, ఆనందభాష్పాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి. ఈ వేడుకకు కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎంకే భాటియా స్వయంగా బీఎండబ్ల్యూ కారులో విచ్చేసి ఉద్యోగులను అభినందించారు. సహోద్యోగులు చప్పట్లు కొడుతుండగా కేక్ కట్ చేసి, డ్యాన్సులు చేస్తూ ఆఫీస్ వాతావరణాన్ని పండగలా మార్చేశారు.
ఈ లక్కీ గిఫ్ట్ అందుకున్న వారిలో ఐదేళ్లుగా ఆ కంపెనీలోనే పనిచేస్తున్న నిజాయితీపరుడైన ఉద్యోగి కూడా ఉండటం విశేషం. ఉద్యోగి హోదాతో సంబంధం లేకుండా.. సంస్థలో కనీసం 18 నెలలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనేలా యాజమాన్యం అవకాశం కల్పించింది.
అయితే, ఈ కార్లను పూర్తిగా ఉచితంగా ఇచ్చారా అంటే లేదు. కార్లకు అవసరమైన భారీ డౌన్‌పేమెంట్‌ను కంపెనీనే పూర్తిగా చెల్లించింది. మిగిలిన ఈఎంఐలను ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించేలా, పైగా కార్లను నేరుగా ఆయా ఉద్యోగుల పేర్లపైనే రిజిస్టర్ చేసి వారి కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసానిచ్చింది.
MITS హెల్త్‌కేర్ ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారేం కాదు. 2024 దీపావళి సందర్భంగా ఏకంగా 15 మంది ఉద్యోగులకు టాటా పంచ్, మారుతి సుజుకి, గ్రాండ్ విటారా వంటి కార్లను బహుమతిగా ఇచ్చి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యోగులను కేవలం వనరులుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగా భావించే ఇలాంటి యాజమాన్యాలు ఉంటే, ఆ సంస్థలు ఏ రంగంలోనైనా విజయాల శిఖరాలను అధిరోహించడంలో ఆశ్చర్యమేముంది.




