Guava Leaves: జామ ఆకా.. మజాకా!

Guava Leaves: ఒకప్పుడు ఉచితంగా దొరికిన జామ ఆకులు ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లలో భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి.

Naresh.k
Published on: 8 Jun 2026 2:04 PM IST
Guava Leaves
X

Guava Leaves: జామ ఆకా.. మజాకా!

Guava Leaf Tea: గల్లీలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే.. పక్కన ఏదైనా జామ చెట్టు కనిపిస్తే చాలు, టక్కున నాలుగైదు చిగురుటాకులు తుంపి నోట్లో వేసుకోవడం చాలామందికి అలవాటు. అడిగితే షుగర్ కంట్రోల్ అవుతుంది బాబూ అంటారు. అయితే, ఇకపై అలా పక్కింటి జామ చెట్టు ఆకులు తుంచితే ఆ యజమానులు ఊరుకునేలా లేరు! ఎందుకంటే.. ఒకప్పుడు అడిగినా అడగకపోయినా ఉచితంగా దొరికిన జామ ఆకులు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అది కూడా డిజిటల్ మార్కెట్లో బ్రాండెడ్ రేట్లతో దర్శనమిస్తున్నాయి. ఆరోగ్య స్పృహ పెరిగిన నగరవాసుల దృష్టి ఇప్పుడు జామ ఆకులపై పడటంతో.. ఈ-కామర్స్ సైట్లలో వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో జామ చెట్లు వెతకాలంటే భూతద్దం పెట్టాలి. సరిగ్గా ఈ అవసరాన్నే వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో జామ ఆకులను రకరకాల రూపాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. కేవలం 50 జామ ఆకుల ధర అక్షరాలా రూ.199.అది కూడా 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో. 100 గ్రాముల ఎండిన జామ ఆకుల ధర రూ.90. పావు కిలో పౌడర్ కొనాలంటే రూ.249 సమర్పించుకోవాల్సిందే. ఇది కాకుండా మార్కెట్లోకి ప్రత్యేకంగా జామ ఆకుల టీపొడి కూడా వచ్చేసింది.

ఇంత రేటు పెట్టి మరీ జామ ఆకులను ఎందుకు కొంటున్నారు? అసలు వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? అని ఆరా తీస్తే ఆయుర్వేద నిపుణులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జామ ఆకుల రసం లేదా దాంతో చేసిన టీ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అతిసారం, పేగు సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. దగ్గు, దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జామ ఆకులు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని, శరీరంలోని విషపదార్థాలను తొలగించి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయని శ్రీయాం ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ నాగేంద్ర పేర్కొన్నారు. జుట్టు రాలడాన్ని నివారించేందుకు జామ ఆకుల రసాన్ని హెయిర్ మాస్క్‌గా కూడా వాడుతున్నారు. మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాల్లో ఈ ఆకులను సాంప్రదాయ వైద్యంలో ఎప్పటి నుంచో వాడుతుండగా.. ఇప్పుడు మన దేశంలోనూ ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story