EV Purchase Rules: ప్రభుత్వ కార్లకు ఈవీలే ప్రాధాన్యం.. కేంద్రం కొత్త రూల్స్

ప్రభుత్వ శాఖల కార్ల కొనుగోలుకు కేంద్రం కొత్త రూల్స్.. ఈవీలకు రూ.20 లక్షలు, పెట్రోల్ కార్లకు రూ.10 లక్షల పరిమితి విధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2026 4:00 AM IST
EV Purchase Rules
X

EV Purchase Rules

EV Purchase Rules : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసే అధికారిక కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ శాఖలు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై రూ.20 లక్షల ధర పరిమితిని విధించింది. మరోవైపు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వాహనాల కొనుగోలుకు రూ.10 లక్షల పరిమితిని నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026 నవంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి ఈ నిర్ణయం వెనుక ఉన్న నిబంధనలేంటి? ప్రభుత్వ ఉద్యోగులకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు రూ.20 లక్షల పరిమితి

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వాహన కొనుగోలు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇకపై అధికారిక అవసరాల కోసం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందుకోసం ఒక్కో వాహనం నికర డీలర్ ధర (Net Dealer Price) గరిష్టంగా రూ.20 లక్షలుగా నిర్ణయించింది.

అంటే ప్రభుత్వ శాఖలు అధికారిక అవసరాల కోసం రూ.20 లక్షల లోపు ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ రవాణా వ్యవస్థలో క్రమంగా మార్పులు తీసుకురావడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

పెట్రోల్, డీజిల్ కార్లకు రూ.10 లక్షల పరిమితి

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తూనే పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై కేంద్రం పరిమితులు విధించింది. ఈ వాహనాల నికర డీలర్ ధర రూ.10 లక్షలకు మించకూడదు. అంటే ఎలక్ట్రిక్ కార్లకు రూ.20 లక్షల వరకు అవకాశం కల్పించగా.. సంప్రదాయ ఇంధన వాహనాలకు మాత్రం రూ.10 లక్షల పరిమితి విధించింది.

ఇకపై పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోలు అంత సులభం కాదు!

కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలు సాధారణంగా పెట్రోల్, డీజిల్ లేదా హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయడానికి వీలుండదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు.

అయితే ఇందుకోసం సంబంధిత శాఖలు ప్రత్యేక అనుమతి (Ad-hoc Relaxation) తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎలక్ట్రిక్ కార్లకు బదులుగా పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వస్తోందో అధికారులు వివరిస్తూ ప్రతిపాదన సమర్పించాలి. ఈ ప్రతిపాదనకు సంబంధిత శాఖ కార్యదర్శి, ఆర్థిక సలహాదారు ఆమోదం తప్పనిసరి.

ఈ నిబంధనలు వాహనాలను లీజుకు తీసుకునే సందర్భంలోనూ వర్తిస్తాయి. అంటే ప్రభుత్వ శాఖలు పెట్రోల్, డీజిల్ వాహనాలను లీజుకు తీసుకోవాలన్నా ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త వాహన కొనుగోలు మార్గదర్శకాలు 2026 నవంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ శాఖలు ఇకపై అధికారిక వాహనాల కొనుగోలు సమయంలో ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే వాహనాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రభుత్వ ఉద్యోగులకు కారు కొనుగోలు అలవెన్స్ వస్తుందా?

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు రూ.20 లక్షల పరిమితి విధించడంతో ఉద్యోగులకు కూడా కొత్తగా కారు కొనుగోలు అలవెన్స్ లేదా సబ్సిడీ లభిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ కొత్త విధానం కేవలం కేంద్ర ప్రభుత్వ శాఖలు అధికారిక అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తిగతంగా కార్లు కొనుగోలు చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రత్యేక కారు అలవెన్స్ లభించదు. అలాగే ఉద్యోగులు ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక సబ్సిడీ ఇచ్చే నిబంధన కూడా ఇందులో లేదు.

అంటే ప్రభుత్వ కార్యాలయాల కోసం కొనుగోలు చేసే అధికారిక కార్ల విషయంలోనే ఈ మార్పులు వర్తిస్తాయి. ఉద్యోగుల వ్యక్తిగత వాహన కొనుగోళ్లకు ఈ మార్గదర్శకాలకు సంబంధం లేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్