5 Days Banking: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వారానికి 5 రోజులే పని..!

5 Days Banking: బ్యాంకు ఉద్యోగుల చిరకాల కోరికైన వారానికి 5 రోజుల పనిదినాల అమలుపై ఐబీఏ , యూఎఫ్‌బీయూ హై-లెవల్ కమిటీ తొలి సమావేశం ముగిసింది.

Gagan kumar
Published on: 14 Nov 2026 9:58 AM IST
5 Days Banking
X

5 Days Banking: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వారానికి 5 రోజులే పని..!

All Saturdays holiday for banks: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగుల చిరకాల స్వప్నమైన వారానికి 5 రోజుల పనిదినాల అమలు దిశగా అత్యంత కీలకమైన అడుగు పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య ఏర్పాటైన హై-లెవల్ కమిటీ తొలి సమావేశం తాజాగా ముగిసింది. ఈ భేటీలో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

5 రోజుల పనిదినాలపై చర్చలు కాలయాపన లేకుండా, సమయబద్ధంగా సాగాలని యూనియన్ నేతలు సమావేశంలో గట్టిగా పట్టుబట్టారు. ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా, మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించడం వల్ల కస్టమర్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగదని హై-లెవల్ కమిటీ గుర్తించింది. డిజిటల్ బ్యాంకింగ్ విస్తృతమైన నేపథ్యంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తూనే ఈ విధానాన్ని అమలు చేసే దిశగా కసరత్తు వేగవంతమైంది.

గత సెప్టెంబర్ 27, 2026 నాడు విధులు నిర్వహించిన ప్రైవేట్ బ్యాంకు అధికారులకు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల మాదిరిగానే ఒక రోజు ప్రత్యేక వేతనం చెల్లించేలా తగిన సూచనలు జారీ చేస్తామని ఐబీఏ అంగీకరించింది. అంతేకాకుండా, ఆ రోజు వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరు కాలేకపోయిన ఉద్యోగులు, అధికారులను సెలవు దరఖాస్తులు అడగవద్దని బ్యాంకు యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు ఇస్తామని ఐబీఏ తెలిపింది.

ప్రస్తుత వేతన సెటిల్మెంట్ గడువు అక్టోబర్ 2027లో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే, కొత్త వేతన సవరణ అంశాలను చేపట్టడానికి ముందుగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని యూనియన్లు ఐబీఏను కోరాయి.

ఉద్యోగులకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం సవరణలపై చర్చించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఐబీఏ హామీ ఇచ్చింది. అలాగే ప్రైవేట్ బ్యాంకు పెన్షనర్లకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత బ్యాంకు యాజమాన్యాలతో మాట్లాడతామని స్పష్టం చేసింది.

చర్చల ప్రక్రియ అధికారికంగా, సానుకూల వాతావరణంలో ప్రారంభమైందని, త్వరలోనే బ్యాంకు ఉద్యోగులకు అనుకూలంగా తుది నిర్ణయం వెలువడుతుందని యూనియన్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.