Gas Subsidy: ఆధార్ బయోమెట్రిక్ లేకుంటే గ్యాస్ సబ్సిడీ కట్?

Gas Subsidy: ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేయని గ్యాస్‌ వినియోగదారులకు అక్టోబర్‌ 1 నుంచి 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్‌ బుకింగ్‌పై ప్రభావం పడనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 7:06 AM IST
Gas Subsidy
X

Gas Subsidy: ఆధార్ బయోమెట్రిక్ లేకుంటే గ్యాస్ సబ్సిడీ కట్?

Gas Subsidy: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు కీలక అప్‌డేట్‌.. ఇకపై ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ (BAA) పూర్తి చేయడం తప్పనిసరి కానుంది. బీఏఏ పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్‌ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్‌పీజీ సిలిండర్‌ను సబ్సిడీతో బుక్‌ చేసుకునే అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే దీనివల్ల గ్యాస్‌ కనెక్షన్‌ రద్దు కావడం లేదా పూర్తిగా సరఫరా నిలిచిపోవడం ఉండదు. బీఏఏ పూర్తయ్యే వరకు అవసరమైన వినియోగదారులు 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. బీఏఏ పూర్తయిన వెంటనే 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్‌ సౌకర్యం తిరిగి అందుబాటులోకి వస్తుంది.

BAA అంటే ఏమిటి?

గ్యాస్‌ కనెక్షన్‌దారుడి ఆధార్‌ వివరాలను వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్‌ విధానాల ద్వారా ధ్రువీకరించే ప్రక్రియనే BAA అంటారు. గ్యాస్‌ కనెక్షన్‌ నిజమైన వినియోగదారుడిదేనని ఆధార్‌ ఆధారంగా నిర్ధారించడమే దీని ఉద్దేశం.

ఈ ప్రక్రియకు కేంద్రం తొలుత జూన్‌ 30ను గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత పలు దఫాలు గడువును పొడిగిస్తూ చివరకు సెప్టెంబర్‌ 14 వరకు అవకాశం కల్పించింది. అయితే గడువు ముగిసినప్పటికీ బీఏఏ చేసుకునే అవకాశం పూర్తిగా నిలిపివేయలేదు. ఇంకా ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులు ఇప్పటికీ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇప్పటికే BAA చేసిన వారికి ఎలాంటి టెన్షన్ లేదు

ఇప్పటికే ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేసిన వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదు. బీఏఏ పూర్తి చేయని వారికి ప్రధానంగా ఇబ్బంది 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్‌ బుకింగ్‌ విషయంలోనే ఉండనుంది.

బీఏఏ పూర్తయ్యే వరకు ఈ సిలిండర్‌ను సబ్సిడీ ధరకు బుక్‌ చేసుకునే అవకాశం ఉండదు. అయితే గ్యాస్‌ అత్యవసరంగా అవసరమైతే ఆయిల్‌ కంపెనీల లభ్యతను బట్టి 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై సబ్సిడీ వర్తించదు.

తెలంగాణలో 88 శాతం పూర్తి

తెలంగాణలో సుమారు 1.26 కోట్ల గృహ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 14 నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సుమారు 88 శాతం మంది బీఏఏ పూర్తి చేశారు.

దేశవ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో వినియోగదారులు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 19 నాటికి దేశంలో 27.43 కోట్ల యాక్టివ్‌ గృహ ఎల్‌పీజీ వినియోగదారులు, అంటే సుమారు 89.9 శాతం మంది BAA పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

BAA ఎలా పూర్తి చేసుకోవాలి?

ఇంకా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులు ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు పలు మార్గాలను ఆయిల్‌ కంపెనీలు అందుబాటులో ఉంచాయి.

సిలిండర్‌ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది ద్వారా

సంబంధిత గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయంలో

ఆయిల్‌ కంపెనీల మొబైల్‌ యాప్‌ల ద్వారా

ఇండేన్‌, భారత్‌గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులకు డిజిటల్‌ మార్గాల్లోనూ BAA పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

అందువల్ల ఇప్పటివరకు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్‌ సౌకర్యాన్ని కొనసాగించుకోవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్