ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలా.? అయితే మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించాల్సిందే!
Financial Freedom: పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు, వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం.. ఇవి ప్రతి ఒక్కరూ కోరుకునే ముఖ్యమైన లక్ష్యాలు. అయితే వీటిని సాధించడానికి భారీ ఆదాయం కావాలని చాలా మంది భావిస్తారు.
Financial Freedom
Financial Freedom: పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు, వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం.. ఇవి ప్రతి ఒక్కరూ కోరుకునే ముఖ్యమైన లక్ష్యాలు. అయితే వీటిని సాధించడానికి భారీ ఆదాయం కావాలని చాలా మంది భావిస్తారు. కానీ ముందుగానే ప్రణాళిక వేసుకుంటే ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకుని, ఎవరి మీదా ఆధారపడకుండా జీవించవచ్చు.
అత్యవసర నిధి, బీమాతో భద్రత
ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, అనుకోని ఖర్చులు వంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. అందుకే కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునే వీలున్న సురక్షితమైన మార్గాల్లో ఈ మొత్తాన్ని దాచుకోవాలి.
అలాగే, కుటుంబ అవసరాలకు తగిన ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఉద్యోగ సంస్థ ఇచ్చే బీమాపైనే పూర్తిగా ఆధారపడకుండా సొంత పాలసీ అవసరాన్ని కూడా పరిశీలించాలి. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సంపాదించే వ్యక్తి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
అప్పులు తగ్గించి పొదుపు పెంచండి
జీతం పెరిగిన ప్రతిసారీ ఖర్చులు పెంచుకుంటే పొదుపు చేయడం కష్టమవుతుంది. అందుకే నెలవారీ ఆదాయం, ఖర్చులను లెక్కించుకుని, జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. అనవసరమైన షాపింగ్, ఇతర ఖర్చులను తగ్గిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చు.
క్రెడిట్ కార్డు బాకీలు, అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు ఆర్థిక ప్రగతికి అడ్డంకిగా మారుతాయి. వీలైనంత త్వరగా ఇలాంటి అప్పులను తగ్గించుకోవాలి. కొత్త రుణం తీసుకునే ముందు ఈఎంఐ చెల్లింపులు కుటుంబ బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. అప్పులు తగ్గినప్పుడే భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మొత్తాన్ని దాచుకోగలం.
చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించండి
పెట్టుబడులు పెట్టడానికి లక్షల రూపాయలు అవసరం లేదు. బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లలో సిప్ వంటి మార్గాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు, నెలకు రూ.500తో పెట్టుబడి ప్రారంభించి, ఆదాయం పెరిగినప్పుడు మొత్తాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. అయితే, అన్ని పెట్టుబడుల్లో ఒకే రకమైన రాబడి ఉండదు.
బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు భద్రతకు ప్రాధాన్యమిచ్చే వారికి ఉపయోగపడవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ ఒడిదొడుకుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. బంగారం, బాండ్లు, ఈక్విటీల వంటి వివిధ మార్గాల్లో పెట్టుబడులను డివైడ్ చేయడం ద్వారా ఒకే పెట్టుబడిపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్, నిబంధనలు తెలుసుకోవాలి.
భవిష్యత్తు లక్ష్యాలకు ముందుగానే ప్రణాళిక
పిల్లల చదువులు, సొంత ఇల్లు, రిటైర్మెంట్.. ప్రతి లక్ష్యానికి ఎంత డబ్బు అవసరమవుతుందో అంచనా వేసుకోవాలి. వాటిని సాధించడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. సొంత ఇల్లు కొనాలనుకునే వారు డౌన్ పేమెంట్ కోసం ముందుగానే పొదుపు చేయాలి. గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ కుటుంబ ఆదాయానికి భారంగా మారకుండా చూసుకోవాలి.
వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు సంపాదిస్తున్నప్పుడే దీర్ఘకాలిక పొదుపు ప్రారంభించాలి. ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడులను కూడా పెంచుకోవాలి. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను రూపొందించుకోవాలి. ఆర్థిక స్వాతంత్య్రం ఒక్కరోజులో సాధించలేం.
క్రమశిక్షణతో పొదుపు చేయడం, అప్పులను తగ్గించడం, సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రమంగా లక్ష్యాలను చేరుకోవచ్చు. చిన్న మొత్తంతో ప్రారంభించినా, దానిని నిరంతరం కొనసాగించడం ముఖ్యం. ఈరోజు వేసుకునే ప్రణాళికే రేపటి ఆర్థిక భద్రతకు పునాది అవుతుంది.




