ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Health Insurance: కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరం. అయితే పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని సరైన బీమా కవరేజీని ఎంచుకోవడం ముఖ్యం.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Health Insurance: కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరం. అయితే పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని సరైన బీమా కవరేజీని ఎంచుకోవడం ముఖ్యం. మరి కుటుంబానికి ఎంత మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం? పాలసీ తీసుకునే ముందు ఏ అంశాలు పరిశీలించాలి? తెలుసుకుందాం.
కుటుంబానికి ఎంత బీమా కవరేజీ అవసరం?
గతంలో రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుందని చాలామంది భావించేవారు. కానీ ప్రస్తుతం వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య ద్రవ్యోల్బణం ఏడాదికి సుమారు 12 నుంచి 13 శాతం వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు, ఐసీయూ చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అందువల్ల సాధారణ కుటుంబానికి రూ.10 లక్షల కవరేజీని ప్రాథమిక స్థాయిగా పరిగణించవచ్చు. భార్యాభర్తలు, పిల్లలు ఉన్న కుటుంబాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని పరిశీలించవచ్చు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సూపర్ టాప్-అప్ పాలసీని కూడా తీసుకోవచ్చు.
వయసు, ఆదాయాన్ని బట్టి కవరేజీని ఎంచుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని నిర్ణయించడంలో కుటుంబ సభ్యుల వయసు కీలకం. 30 ఏళ్లలోపు ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితి, ఆదాయాన్ని బట్టి తగిన కవరేజీని ఎంచుకోవాలి. ఉద్యోగ సంస్థ అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ వ్యక్తిగత పాలసీని కూడా కలిగి ఉండటం మంచిది.
40 ఏళ్లు దాటినవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం మూడు రెట్లు ఉండేలా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం ఉంటే రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల కవరేజీని పరిశీలించవచ్చు. ఇక 60 ఏళ్లు దాటినవారికి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రత్యేక పాలసీ అవసరం కావచ్చు.
75 ఏళ్లు పైబడినవారు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల కవరేజీ లేదా బేస్ పాలసీతో పాటు సూపర్ టాప్-అప్ను పరిశీలించవచ్చు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో వైద్య ఖర్చులు చిన్న పట్టణాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అందుకే నివసించే ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఫ్యామిలీ ఫ్లోటర్, సూపర్ టాప్-అప్ ఎందుకు ముఖ్యం?
కుటుంబంలోని భార్యాభర్తలు, పిల్లలకు ఒకే పాలసీ ద్వారా బీమా కల్పించాలనుకునేవారికి ఫ్యామిలీ ఫ్లోటర్ ఉపయోగపడుతుంది. ఇందులో కుటుంబ సభ్యులంతా ఒకే బీమా మొత్తాన్ని పంచుకుంటారు. ఉదాహరణకు రూ.15 లక్షల ఫ్లోటర్ పాలసీ ఉంటే కుటుంబంలో ఎవరికైనా చికిత్స అవసరమైనప్పుడు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
అయితే కుటుంబంలో తల్లిదండ్రులు లేదా వృద్ధులు ఉంటే వారికి ప్రత్యేక పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వైద్య అవసరాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సూపర్ టాప్-అప్ పాలసీ అదనపు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
ఉదాహరణకు రూ.10 లక్షల బేస్ పాలసీతో పాటు రూ.20 లక్షల సూపర్ టాప్-అప్ తీసుకుంటే, నిర్ణయించిన డిడక్టబుల్ పరిమితి దాటిన అర్హత కలిగిన వైద్య ఖర్చులకు అదనపు కవరేజీ లభిస్తుంది. అయితే ఈ పాలసీ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి.
పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలు చూడండి
హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు కేవలం తక్కువ ప్రీమియం ఉందని పాలసీని ఎంచుకోకూడదు. అవసరమైన సమయంలో క్లెయిమ్ పొందేందుకు అనుకూలమైన నిబంధనలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. మీకు సమీపంలోని ప్రముఖ ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్లో ఉన్నాయో చూడాలి.
ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలకు వర్తించే వెయిటింగ్ పీరియడ్ తెలుసుకోవాలి. ఆసుపత్రి బిల్లులో కొంత మొత్తాన్ని మనమే చెల్లించాల్సి ఉంటుందా అనేది పరిశీలించాలి. రూమ్ రెంట్, ఐసీయూ, నిర్దిష్ట చికిత్సలపై పరిమితులు ఉన్నాయో చూడాలి. అవసరాన్ని బట్టి క్రిటికల్ ఇల్నెస్, వ్యక్తిగత ప్రమాద బీమా వంటి రైడర్లను ఎంచుకోవచ్చు.




