Ethanol Cars: భారత్‌లో పెట్రోల్ కార్లకు కాలం చెల్లెనా? E100 ఇథనాల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్!
Ethanol Cars in India: భారతదేశంలో E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త నిబంధనలు, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ప్రత్యేకతలు ఇవే.
Ethanol Cars: భారత్‌లో పెట్రోల్ కార్లకు కాలం చెల్లెనా? E100 ఇథనాల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్!
Ethanol Cars in India: భారతదేశంలో సంప్రదాయ ఇంధనాలకు చెక్ పెడుతూ, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక అడుగు వేసింది. దేశంలో ఇథనాల్ వాడకాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా 'సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్'లో కేంద్రం కీలక సవరణలు చేసింది. దీని ప్రకారం ఇకపై E85, E100 ఇథనాల్ ఇంధనాలతో నడిచే ప్రత్యేక ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల తయారీకి పూర్తిస్థాయిలో చట్టపరమైన మార్గం సుగమమైంది.
పాత కార్లలో వాడొచ్చా?
ఈ సరికొత్త నిబంధనలు కేవలం రాబోయే కొత్త వాహనాల తయారీకి మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్య ప్రజలు తమ వద్ద ఇప్పటికే ఉన్న సాధారణ పెట్రోల్ కార్లలో నేరుగా E100 ఇథనాల్‌ను వాడటానికి వీలుపడదు. ప్రస్తుతం మన దేశంలో లభించే సాధారణ కార్లు గరిష్టంగా E20 (20% ఇథనాల్) ఇథనాల్‌ను మాత్రమే తట్టుకోగలవు. పూర్తిగా 100 శాతం (E100) ఇథనాల్‌తో నడిచే వాహనాల కోసం ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది.
ధర ఎంత ఉండొచ్చు? ప్రయోజనాలు ఏమిటి?
ఇటీవల మారుతి సుజుకి సంస్థ దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాగన్ ఆర్ కారు E85 ఇథనాల్‌పై నడిచేలా రూపుదిద్దుకుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ లీటరుకు దాదాపు రూ. 20 వరకు తక్కువ ధరకు లభించడం గమనార్హం. అయితే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల కొనుగోలు ధర మాత్రం సాధారణ మోడళ్లతో పోలిస్తే సుమారు రూ. 85,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
దిగుమతి భారం తగ్గించేలా మాస్టర్ ప్లాన్:
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) దిగుమతులపై భారత్ చేస్తున్న భారీ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో చక్కెర ఉత్పత్తి, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారీ ఊపందుకుంటున్న తరుణంలో.. ఆటోమొబైల్ రంగాన్ని హరిత ఇంధనం వైపు మళ్లించే ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే మరిన్ని సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు రోడ్డెక్కనున్నాయి.




