Pension Hike: ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు తీపి కబురు.. కనీస పింఛను పెంపుపై నవంబర్ 19న కీలక నిర్ణయం?
Pension Hike: ఈపీఎస్ కనీస పింఛను పెంపుపై నవంబర్ 19న గుజరాత్‌లో జరిగే సీబీటీ భేటీలో ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది. రూ.1,000గా ఉన్న పెన్షన్ పెంపుపై ఉత్కంఠ.
Pension Hike: ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు తీపి కబురు.. కనీస పింఛను పెంపుపై నవంబర్ 19న కీలక నిర్ణయం?
Pension Hike: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అందిస్తున్న కనీస పింఛను పెంపు డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ వేదికగా నవంబర్ 19న జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (CBT) 240వ కీలక సమావేశంలో ఈ ప్రతిపాదనపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈపీఎస్-95 కింద ఇస్తున్న కనీస పింఛను రూ.1,000గా ఉంది. ఈ పరిమితిని చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో నిర్ణయించారు. అయితే, గత దశాబ్ద కాలంగా పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా నెలకు రూ.1,000 ఎంతమాత్రం సరిపోదని.. కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచడంతో పాటు కరువు భత్యం (DA) వర్తింపజేయాలని పెన్షనర్ల సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితిని (Wage Ceiling) రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలోనే సీబీటీ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుపై కూడా సానుకూల నిర్ణయం వెలువడుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న రూ.7,500 కాకపోయినా, రూ.3,000 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈపీఎస్ నిబంధనల ప్రకారం యజమాని వాటాలో 8.33% పెన్షన్ ఫండ్‌లోకి చేరుతుంది. పెరిగిన వేతన పరిమితి ($25,000$) వల్ల ఇప్పుడు గరిష్టంగా నెలకు రూ.2,083 చొప్పున ఈ నిధి జమ అవుతుంది. పెన్షనబుల్ శాలరీ× పెన్షనబుల్ సర్వీస్/ 70 ఫార్ములా ఆధారంగా ఒక వ్యక్తికి వచ్చే పెన్షన్‌ను లెక్కిస్తున్నారు. ఎవరికైనా ఈ మొత్తం రూ.వెయ్యికంటే తక్కువగా ఉంటే.. తక్కువ పడిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒకవేళ కనీస పెన్షన్ మొత్తం పెంచితే బడ్జెట్‌లో ఆ మేర కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.




