EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా? మెర్జ్ చేయకపోతే కలిగే నష్టాలివే!
EPFO: ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త పీఎఫ్ ఖాతా క్రియేట్ అవుతోందా? అయితే పాత ఖాతాలను అలాగే వదిలేయడం మంచిది కాదు.
EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా? మెర్జ్ చేయకపోతే కలిగే నష్టాలివే!
EPFO: ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త పీఎఫ్ ఖాతా క్రియేట్ అవుతోందా? అయితే పాత ఖాతాలను అలాగే వదిలేయడం మంచిది కాదు. అన్ని పీఎఫ్ ఖాతాలను ఒకే UAN కింద అనుసంధానం చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ పొదుపును సులభంగా నిర్వహించుకోవచ్చు. పాత పీఎఫ్ ఖాతాలను ఎలా మెర్జ్ చేయాలి? దీనివల్ల కలిగే లాభాలేంటి? తెలుసుకుందాం.
ఉద్యోగం మారితే కొత్త PF ఖాతా.. UAN మాత్రం ఒక్కటే!
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసం తరచూ కంపెనీలు మారుతుంటారు. ఇలా ప్రతిసారీ ఉద్యోగం మారినప్పుడు కొత్త సంస్థ ఉద్యోగి పేరుతో మరో PF మెంబర్ ఐడీని క్రియేట్ చేస్తుంది. అయితే, ఉద్యోగికి కేటాయించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రం జీవితాంతం ఒకటే ఉంటుంది. అంటే ఒకే UAN కింద వివిధ కంపెనీలకు సంబంధించిన పలు PF మెంబర్ ఐడీలు ఉండవచ్చు.
చాలామంది ఉద్యోగులు కొత్త సంస్థలో చేరిన తర్వాత పాత పీఎఫ్ ఖాతాలోని నగదును కొత్త ఖాతాకు బదిలీ చేయకుండా వదిలేస్తుంటారు. దీనివల్ల వారి రిటైర్మెంట్ పొదుపు వేర్వేరు ఖాతాల్లో ఉండిపోతుంది. అందుకే పాత PF ఖాతాల్లోని మొత్తాన్ని ప్రస్తుత ఖాతాకు బదిలీ చేసుకోవడం మంచిది. అయితే ముందుగా అన్ని ఖాతాల వివరాలు ఒకే UAN కింద సరిగ్గా అనుసంధానమై ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
పాత PF ఖాతాలను మెర్జ్ చేయడం ఎలా?
మీ పాత పీఎఫ్ ఖాతాల్లోని నగదును ప్రస్తుత ఖాతాకు బదిలీ చేసుకోవడానికి ఆన్లైన్లోనే అవకాశం ఉంది. ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
ముందుగా EPFO అధికారిక మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి 'One Member - One EPF Account' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కనిపించే వ్యక్తిగత వివరాలు, ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించాలి.
పాత PF ఖాతాల వివరాలను నమోదు చేసి, వాటిని ప్రస్తుత ఖాతాకు బదిలీ చేయడానికి అభ్యర్థన సమర్పించాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. అవసరమైన సందర్భాల్లో ప్రస్తుత యజమాని (Employer) కూడా ఈ అభ్యర్థనను ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం EPFO మీ దరఖాస్తును పరిశీలించి PF మొత్తాన్ని బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తుంది.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత ఖాతాల్లోని అర్హమైన PF బ్యాలెన్స్ ప్రస్తుత ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఒకవేళ పాత ఖాతాలు కనిపించకపోయినా, వివరాల్లో తప్పులున్నా లేదా బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎదురైనా EPFO అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
PF ఖాతాల విలీనం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
అన్ని పీఎఫ్ ఖాతాలను ఒకే చోటికి తీసుకురావడం వల్ల ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం దాచుకునే డబ్బును ఒకేచోట పర్యవేక్షించవచ్చు. వివిధ సంస్థల్లో పనిచేసినప్పుడు ఏర్పడిన ఖాతాలను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం తగ్గుతుంది.
అలాగే పాత ఖాతాల్లోని నగదు బదిలీ కాకుండా ఉండిపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఉద్యోగ విరమణ సమయంలో పీఎఫ్ నగదును క్లెయిమ్ చేసుకోవడం కూడా సులభతరమవుతుంది. అయితే క్లెయిమ్ సమయంలో EPFO నిబంధనలు, అర్హతలు తప్పనిసరిగా వర్తిస్తాయి.
సర్వీస్ పీరియడ్, పన్ను ప్రయోజనాల విషయంలోనూ కీలకం
పీఎఫ్ ఖాతాలను సరిగ్గా అనుసంధానం చేసుకోవడం వల్ల ఉద్యోగి మొత్తం సర్వీస్ రికార్డును నిర్వహించడం సులభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం మారినప్పటికీ పాత సంస్థలోని PF మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయడం ద్వారా అర్హమైన సందర్భాల్లో సర్వీస్ పీరియడ్ కొనసాగుతుంది. ఇది ఐదేళ్ల నిరంతర సేవకు సంబంధించిన పన్ను నిబంధనల విషయంలో కీలకంగా మారుతుంది.
సాధారణంగా ఐదేళ్ల నిరంతర సేవ పూర్తికాకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, కొన్ని పరిస్థితుల్లో పన్ను వర్తించవచ్చు. అయితే పాత ఉద్యోగ కాలాన్ని కొత్త ఉద్యోగ కాలంతో కలిపి లెక్కించే అర్హత ఉన్నప్పుడు ఐదేళ్ల సర్వీస్ నిబంధనను పరిగణనలోకి తీసుకుంటారు.
తద్వారా పీఎఫ్ విత్‌డ్రాపై పన్ను భారం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు కంపెనీ మారిన ప్రతిసారీ పాత పీఎఫ్ ఖాతాను నిర్లక్ష్యం చేయకుండా, కొత్త ఖాతాకు నగదు బదిలీ అయ్యిందో లేదో తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న మొత్తాన్ని క్రమబద్ధంగా నిర్వహించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.




