Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రికార్డు.. రోజుకు రూ. 10,900 కోట్ల సంపాదన
Elon Musk: ఎలాన్ మస్క్ సంపద 2026 తొలి 9 నెలల్లో రూ. 29.85 లక్షల కోట్లు పెరిగింది. రోజుకు సగటున రూ. 10,900 కోట్ల ఆస్తి పెరగడంతో ఆయన నికర విలువ 977 బిలియన్ డాలర్లకు చేరింది.
Elon Musk
Elon Musk: ప్రపంచ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్న టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ సంపాదనలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 సంవత్సరం మొదటి 9 నెలల్లో ఆయన ఆస్తి అనూహ్యంగా పెరిగింది. ఈ కాలంలో మస్క్ రోజుకు సగటున రూ. 10,900 కోట్లు సంపాదించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు, టెక్ షేర్ల దూకుడుతో మస్క్ సంపద సరికొత్త శిఖరాలకు చేరింది.
ఒకే రోజులో $62.6 బిలియన్ల లబ్ధి
సోమవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ ఆస్తి ఏకంగా 62.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది ఆయన మొత్తం ఆస్తిలో 6.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో మస్క్ నికర ఆస్తి విలువ 977 బిలియన్ డాలర్లకు చేరింది. ఆగస్టు 12 తర్వాత ఒక్క రోజులోనే డాలర్ రూపంలో ఆయనకు లభించిన అతిపెద్ద లాభం ఇది. స్పేస్ ఎక్స్, ఎక్స్ ఏఐ సంస్థల విలీనం తర్వాత మస్క్ కొన్ని క్షణాలు ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు.
టెక్ బిలియనీర్ల ఊహించని సంపద
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న టాప్ 500 మంది ధనవంతులలో 100 మంది టెక్ బిలియనీర్ల సంయుక్త ఆస్తి సెప్టెంబర్ 30 నాటికి 845 బిలియన్ డాలర్లు పెరిగింది. ఏ సంవత్సరంలో అయినా మొదటి 9 నెలల్లో ఈ స్థాయిలో సంపద పెరగడం ఇదే తొలిసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వచ్చిన విపరీతమైన డిమాండ్, అమెరికన్ టెక్ కంపెనీల షేర్ల విపరీతమైన గ్రోత్ ఇందుకు ప్రధాన కారణం.
గ్లోబల్ టాప్ 10లో అమెరికన్ల హవా
సెప్టెంబర్ 10 తర్వాత ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన మొదటి 10 స్థానాల్లోనూ అమెరికన్లే నిలవడం ప్రత్యేక ఆకర్షణ. 2012లో బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్స్ ప్రారంభించిన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. టాప్ 10 బిలియనీర్లలో తొమ్మిది మంది సంపద నేరుగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీలతో ముడిపడి ఉంది. టెక్నాలజీ కాకుండా ఇతర రంగాల్లో ఉన్న సంపన్నుల ఆస్తి ఈ కాలంలో 62 బిలియన్ డాలర్లు తగ్గింది.
మైకేల్ డెల్, మార్క్ జుకర్‌బర్గ్ జోరు
డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైకేల్ డెల్ ఆస్తి ఈ ఏడాది 81 శాతం పెరిగి 254 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో మెటా ప్లాట్‌ఫామ్స్ షేర్ల భారీ ర్యాలీ కారణంగా మార్క్ జుకర్‌బర్గ్ ఆస్తిలో కూడా 23 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వచ్చి చేరింది. ఏఐ, టెక్నాలజీ రంగాలే భవిష్యత్తులో ప్రపంచ సంపదను ఏలబోతున్నాయని ఈ గణాంకాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి.




