Egg Prices Soar: చికెన్ కంటే గుడ్డే ఖరీదు అయ్యేలా ఉందా? భారీగా పెరుగుతున్న ధరలు
Egg Prices Soar: తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.
Egg Prices Soar: చికెన్ కంటే గుడ్డే ఖరీదు అయ్యేలా ఉందా? భారీగా పెరుగుతున్న ధరలు
Egg Prices Soar: ఒకప్పుడు కేవలం ఐదు రూపాయలకే దొరికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో గుడ్డు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా రూ.9 వరకు పలుకుతోంది. అంటే ఒక డజను గుడ్లు కొనాలంటే వినియోగదారులు రూ.108 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న వారాల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గుడ్డు ధర ఎందుకు ఇంతలా పెరిగింది? అసలు కారణాలు ఇవే:
1. భారీగా పెరిగిన కోళ్ల దాణా (Poultry Feed) ధరలు:
కోళ్ల పెంపకంలో దాణా అత్యంత కీలకం. కోళ్లకు ఆహారంగా వేసే మొక్కజొన్న, సోయాబీన్, నూకలు ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. మొక్కజొన్న: గతేడాది కిలో రూ.18 ఉండగా, ప్రస్తుతం రూ.34కి చేరింది. బ్రోకెన్ రైస్ (నూకలు): గతేడాది కిలో రూ.14 ఉండగా, ఇప్పుడు రూ.32 పలుకుతోంది.
2. ఇథనాల్ పరిశ్రమ ప్రభావం, దిగుబడి తగ్గుదల:
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి మొక్కజొన్నను భారీగా ఉపయోగిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు మొక్కజొన్న కొరత ఏర్పడి డిమాండ్ ఒత్తిడి పెరిగింది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మొక్కజొన్న పండించే రాష్ట్రాల్లో వర్షపాతం లోటు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ ఉత్పత్తి 15 నుంచి 16 శాతం తగ్గవచ్చని అంచనా. దీనికి తోడు ధరలు ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు సరుకును నిల్వ చేస్తుండటం సరఫరాపై మరింత ఒత్తిడి పెంచుతోంది.
3. ఉత్పత్తి వ్యయ భారం:
దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఒక్కో గుడ్డు ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం కూడా పెరిగింది. ఈ భారాన్ని పౌల్ట్రీ రైతులు పూర్తిగా భరించలేక గుడ్ల అమ్మకపు ధరలను పెంచక తప్పడం లేదు. అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు తట్టుకోలేక కొందరు రైతులు కోళ్లను ముందుగానే విక్రయించేస్తుండటంతో రాబోయే రోజుల్లో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
4. చలికాలం, పండుగల డిమాండ్:
సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలితీవ్రతతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, బేకరీ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల గుడ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
డిసెంబర్ నాటికి 30% పెరిగే ఛాన్స్!
ప్రస్తుత పరిస్థితులు, ముడిసరుకు ధరలు, రాబోయే సీజన్ డిమాండ్‌ను పరిశీలిస్తే.. డిసెంబర్ నాటికి గుడ్లు, చికెన్ ధరలు మరో 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం చలికాలం మాత్రమే కాకుండా వ్యవసాయ దిగుబడులు, ఇథనాల్ వినియోగం, దాణా ధరల పెరుగుదల వెరసి సామాన్యుడికి పౌష్టికాహారమైన గుడ్డును భారంగా మార్చాయి.




