DMart: డిమార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్ల మాయాజాలం.. షాపింగ్ చేసే ముందు జర జాగ్రత్త!
DMart: డిమార్ట్‌లో రూ.199కే వస్తువులంటూ వైరల్ అవుతున్న ప్రచారంలో నిజమెంత? డిస్కౌంట్ ఆఫర్లను నమ్మి షాపింగ్ చేసే ముందు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
DMart: డిమార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్ల మాయాజాలం.. షాపింగ్ చేసే ముందు జర జాగ్రత్త!
DMart shopping: నెలసరి సరుకులు, కిచెన్ వస్తువులు, ఇంటి అవసరాలకు ఏది కావాలన్నా సరే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు డిమార్ట్. తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే నమ్మకంతో గృహిణులు ఎప్పుడూ డిమార్ట్ వైపు అడుగులు వేస్తుంటారు. ముఖ్యంగా నెలాఖరు సమయంలో ప్రత్యేక డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు బడ్జెట్లో షాపింగ్ చేసేవారిని విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో డిమార్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
సాధారణ మార్కెట్లో రూ.400 నుంచి రూ.500 విలువ చేసే కొన్ని వస్తువులు, డిమార్ట్‌లో కేవలం రూ.199 కే లభిస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు బయట మార్కెట్లో రూ.400-500 ఉండే పూజా గంట లేదా రూ.749 విలువ చేసే స్టీల్ పూజా గిన్నె డిమార్ట్‌లో రూ.199 కే వస్తోందన్న ప్రచారంతో జనాలు ఎగబడుతున్నారు. అయితే, ఇలాంటి ఆఫర్లను చూసి గుడ్డిగా షాపింగ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను కచ్చితంగా గమనించాలి.
సోషల్ మీడియాలో ఏదో ఒక బ్రాంచ్‌కు సంబంధించిన వీడియో చూసి, మీ దగ్గరిలోని డిమార్ట్‌కు వెళ్తే అదే ధర ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ప్రాంతం, స్టాక్ లభ్యత, స్థానిక డిమాండ్ , ఆఫర్ కాలపరిమితిని బట్టి ధరలు మారుతుంటాయి. రూ.199 కదా అని అవసరం లేని వస్తువును కొనుగోలు చేస్తే.. ఆ డబ్బు వృథా కావడమే కాకుండా ఇంట్లో చెత్త పెరుగుతుంది.
డిస్కౌంట్ ఎంత ఉన్నప్పటికీ మనకు ఆ వస్తువు ఎంతవరకు ఉపయోగం అనేది ముఖ్యం. తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనే ముందు దాని బరువు, మెటీరియల్, తయారీ నాణ్యత ఎలా ఉందో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు నాణ్యత లేని వస్తువులను తక్కువ ధరకు అంటగట్టే అవకాశం ఉంటుంది.
ఆ వస్తువు ఏ బ్రాండ్‌కు చెందింది? ఆన్లైన్ లేదా ఇతర లోకల్ మార్కెట్లతో పోలిస్తే నిజంగా అక్కడ ధర తక్కువేనా అనేది బేరీజు వేసుకోవడం మంచిది. లిస్ట్ లేకుండా డిమార్ట్‌లోకి అడుగుపెడితే ఆఫర్ల మాయలో పడి అనవసరమైన ఎన్నో వస్తువులను కార్ట్‌లో వేసుకుంటాం. అందుకే ఇంట్లోనే ఒక పక్కా షాపింగ్ లిస్ట్ తయారు చేసుకుని వెళ్లడం ఉత్తమం.
ఆఫర్ ప్రైస్ చూసి వస్తువును తీసుకున్న తర్వాత.. బిల్లింగ్ సమయంలో స్క్రీన్‌పై పడుతున్న లేదా బిల్లులో ప్రింటవుతున్న ధర సరైనదేనా లేదా అని ఒక్కసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. డిమార్ట్‌లో లభించే తక్కువ ధరల ఆఫర్లు మన బడ్జెట్‌ను ఆదా చేయడానికి చక్కటి అవకాశమే. కాకపోతే ప్రతి డిస్కౌంట్‌ను గుడ్డిగా నమ్మకుండా, మన అవసరాన్ని బట్టి తెలివిగా షాపింగ్ చేయడమే అసలైన పొదుపు.




