Direct Tax Collections: రూ. 13.38 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు... కార్పొరేట్, ఎస్టీటీ ఊతంతో 13.21 శాతం వృద్ధి!
Direct Tax Collections: భారత్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.21 శాతం పెరిగి రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్ను, STT వసూళ్లు జోరందుకున్నాయి.
Direct Tax Collections: రూ. 13.38 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు... కార్పొరేట్, ఎస్టీటీ ఊతంతో 13.21 శాతం వృద్ధి!
Direct Tax Collections: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 14 మధ్య కాలానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పన్ను వసూళ్లు ఏటా 13.21 శాతం పెరిగి రూ. 13.38 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న పూర్తి సంవత్సర బడ్జెట్ లక్ష్యంలో దాదాపు 50 శాతానికి సమానం కావడం గమనార్హం. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs) వంటి కార్పొరేటేతర పన్ను చెల్లింపుదారులకు వాపసులు (రీఫండ్లు) ఏకంగా 67 శాతం పెరిగినప్పటికీ, కార్పొరేట్ పన్ను వసూళ్లలో నమోదైన బలమైన వృద్ధే ఈ ఘనతకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.
కార్పొరేట్ పన్నుల హవా: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 20.58 శాతం వృద్ధితో రూ. 5.99 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. మరోవైపు, కార్పొరేటేతర పన్ను వసూళ్లు 5.83 శాతం పెరిగి రూ. 6.92 లక్షల కోట్లకు చేరాయి.
దూసుకెళ్లిన ఎస్టీటీ (STT): అక్టోబర్ 14 నాటికి సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) వసూళ్లు ఏకంగా 52 శాతం పెరిగి రూ. 46,840 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను STT వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ. 73,700 కోట్లుగా ఉంది.
బడ్జెట్ లక్ష్య సాధనదిశగా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ. 26.97 లక్షల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 23.40 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం కాగా, అక్టోబర్ మధ్య నాటికే సగం లక్ష్యం పూర్తయింది.
ఈ గణాంకాలు దేశంలో బలమైన పన్నుల చెల్లింపును, పటిష్టమైన వ్యాపార పనితీరును ప్రతిబింబిస్తున్నాయని ప్రైస్ వాటర్హౌస్ & కో LLP భాగస్వామి హితేష్ సాహ్నీ పేర్కొన్నారు. స్థిరమైన GDP వృద్ధికి, ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడిదారుల భాగస్వామ్యానికి ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని ఆయన వివరించారు.




